సాధారణంగా ట్రాక్టర్ వేగం గంటకు 40 కిలోమీటర్లు మించదు. కానీ అక్కడ రయ్ రయ్ మంటూ గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి ట్రాక్టర్లు. ఎందుకంటే అక్కడ జరిగేది రేస్.
రష్యాలోని రోస్టోవ్‌లో ఏటా బైజోన్ ట్రాక్ షో పేరుతో ట్రాక్టర్ల రేస్ నిర్వహిస్తారు. ఈసారీ పోటీలు ఘనంగా జరిగాయి. మొత్తం 33 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. వ్యవసాయం పట్ల యువతలో ఆసక్తి పెంపొందించేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
"నేను మోటర్ రేసింగ్‌లో చాలాసార్లు ప్రాతినిధ్యం వహించా. రష్యా ఛాంపియన్షిప్, ప్రపంచకప్‌లోనూ పాల్గొన్నా. నాకు వ్యవసాయంతో అనుబంధం ఉంది. రేసింగ్, వేగం, వ్యవసాయం ఇవన్నీ కలిపి నన్ను ఈ రేస్ నిర్వహించేలా చేశాయి. ప్రతి పందెంలో తప్పనిసరిగా 2, 3 ట్రాక్టర్లు బోల్తా పడతాయి. అది నిబంధన అంతే. ఓసారి పందెంలో ఒక్కటీ బోల్తా పడకుండానే పోటీలు ముగిశాయి. అప్పుడు వీక్షకులు నిరాశకు లోనయ్యారు. కానీ ట్రాక్టర్ బోల్తా పడిందంటే మాత్రం వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఇది సినిమా కాదు. నిజమే అనుకుంటారు."
-సెర్గే సుఖోవెంకో, నిర్వాహకుడు
భద్రతా ప్రమాణాలు తప్పనిసరి
పాల్గొనేవారిని దశలవారీగా ఎంపిక చేస్తారు. ప్రాథమిక పోటీల్లో అర్హత సాధిస్తేనే తదుపరి అవకాశం. తొలుత నాకౌట్ పందేనికి 10 మందిని ఎంపిక చేస్తారు. వారు ఇద్దరు నుంచి ఐదుగురు వరకు జట్టులా ఏర్పడి నాకౌట్ రేసులో పాల్గొంటారు. ఎవరు ముందుంటే వారికి ఎక్కువ పాయింట్లు. అలా ఈసారి రేసులో 33 మంది పాల్గొన్నారు.
ఈ పోటీల్లో ట్రాక్టర్ నడిపే డ్రైవరు అన్నిరకాల భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది.
10 కిలోమీటర్ల ట్రాక్...
ఈ పోటీలు జరిగే ట్రాక్ 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పదునైన మూలల్లో, స్ప్రింగులా ఎగరటంలో, బురద గుంటల్లోంచి దూసుకెళ్లటంలో డ్రైవర్లు నైపుణ్యం ప్రదర్శిస్తారు. ఈ ట్రాక్టర్లలో సగానికిపైగా పొలాల్లో పనిచేసేవే.
ఓ మహిళా ఔత్సాహికురాలూ పోటీల్లో పాల్గొన్నారు. 2002 నుంచి జరుగుతున్న ఈ పోటీల్లో ఈసారి పాల్గొన్న ఓల్గా పొడుఖ్వతిలినా ఇప్పటి వరకు రేసులో పాల్గొన్న రెండో మహిళ.
"ఇది చాలా కష్టంతో కూడుకున్నది. వాళ్లంతా ఇక్కడికి మొదటిసారి రాలేదు. నేను మాత్రం మొదటిసారే వచ్చాను. వాళ్లకు అంతా తెలుసు. నాకు మాత్రం అంతా కొత్తే."
-ఓల్గా పొడుఖ్వతిలినా, ఔత్సాహికురాలు
పోటీల్లో విజేతలకు ట్రాక్టర్లు బహుకరించారు. ప్రథమ బహుమతి గెలుపొందిన మిరోనోవ్కు యాంట్ జెటర్ 4135 ఎఫ్, రెండు, మూడో బహుమతిగా మరో ఇద్దరికి మిన్సుక్ ట్రాక్టర్లు అందించారు.