కరోనా మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్నాయి. తాజాగా కొవిడ్-19 వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది రష్యా. మాస్కోకు చెందిన గమలేయ పరిశోధన సంస్థ రెండు రకాలుగా (ద్రవ రూపం, పొడి) అభివృద్ధి చేసిన ఇంజెక్షన్లను రెండు బృందాలపై ప్రయోగించనున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కో బృందంలో 38 మందిపై ఈ ప్రయోగం చేయనున్నారు. వారిని మాస్కోలోని ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌కు తరలించనున్నట్లు తెలిపింది రష్యా.
" కరోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ ట్రయల్స్ చేయటం చాలా ప్రత్యేకం. కాబట్టి పెద్ద ఎత్తున జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ఈ ట్రయల్స్‌లో పాల్గొనే వారిని రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉంచి పరిశీలన చేయనున్నాం. తొలి ఇంజక్షన్.. గురు, శుక్ర వారాల్లో వేసేందుకు సిద్ధం చేశాం."
- ఆరోగ్య శాఖ, రష్యా
మానవులపై వ్యాక్సిన్ ట్రయల్స్ చేసే ముందు తాను, మరికొందరు పరిశోధకులపై టీకాను ప్రయోగించుకున్నట్లు గమలేయ సంస్థ డైరెక్టర్, ప్రొఫెసర్ అలెగ్జాండర్ గిట్స్బర్గ్ గత నెల జూన్‌లోనే ఓ ప్రకటన చేశారు. అయితే.. టీకాను ఎంత మందిపై ప్రయోగించారని వెల్లడించలేదు. కానీ, ఎవరికీ దుష్ప్రభావాలు కనిపించలేదని తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా రోగులకు ప్రాణదాతగా మారిన ఔషధం!