Russia Captures Kherson: ఉక్రెయిన్‌పై.. క్షిపణులు, బాంబులు, రాకెట్లతో విరుచుకుపడుతోంది రష్యా. ఎటువెళ్లాలో తెలియక ప్రజలు అల్లాడిపోతున్నారు. పెద్ద పెద్ద భవనాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. రెండు దేశాల సైన్యాల మధ్య భీకరపోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో ప్రధాన నగరం ఖేర్సన్ను తమ వశం చేసుకుంది రష్యా. ఈ మేరకు ఉక్రెయిన్ అధికారులు ధ్రువీకరించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది. ఖేర్సన్.. నల్ల సముద్రం వద్ద ఉక్రెయిన్‌కు వ్యూహాత్మకంగా ఉన్న ముఖ్యమైన పోర్ట్ సిటీ.
కొద్దిగంటల ముందు.. ఖేర్సన్ను రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకోలేదని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అక్కడ ఇంకా రష్యా బలగాలతో యుద్ధం జరుగుతోందని వెల్లడించింది. అయితే.. రష్యా బలగాలు ఖేర్సన్ ప్రభుత్వ ప్రధాన కార్యాలయానికి వచ్చాయని చెప్పారు గవర్నర్ ఐగర్ కోలిఖేవ్.
కీవ్‌లో భారీ పేలుళ్లు..
Explosions in Kyiv: మొదటి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న రష్యా సైన్యం.. అక్కడ భారీ దాడులకు పాల్పడుతోంది. గురువారం ఉదయం కీవ్‌లోని డ్రుజ్బీ నరోదివ్ మెట్రో స్టేషన్ సమీపంలో రెండు పేలుడు ఘటనలు జరిగినట్లు స్థానిక వార్తాసంస్థ కీవ్ ఇండిపెండెంట్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే రాజధానిలో వాయుదాడులు జరిగే అవకాశముందని, ప్రజలు షెల్టర్లలోకి వెళ్లాలని సూచించినట్లు పేర్కొంది. కీవ్‌లోని కీవ్ ఒబ్లాస్ట్, మైకొలెవ్, లవీవ్, చెర్నిహివ్ ఒబ్లాస్ట్, ఒడెసా సహా పలు ప్రాంతాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
10 లక్షల మంది వలస..
1 Million Flee Ukraine: రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 10 లక్షల మందికిపైగా పొరుగుదేశాలకు తరలిపోయినట్లు ఐక్యరాజ్యసమితి శరుణార్థుల విభాగం వెల్లడించింది. ప్రజలు వెల్లువలా తరలిపోతున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని పేర్కొంది. దాదాపు 40 లక్షల మంది వలసపోయే అవకాశం ఉందని ఇప్పటికే అంచనా వేసిన ఐరాస.. దానిపై పునరాలోచన చేయనుంది. వీరిలో ఎక్కువగా పోలాండ్, హంగేరీకి తరలిపోతున్నారు.
సొంత వాహనాలను ధ్వంసం చేస్తున్న రష్యా సైనికులు!
ఉక్రెయిన్‌పై యుద్ధం వద్దంటూ రష్యన్లు మాస్కోలో నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలోనే.. మరో సంచలన విషయం వెలుగుచూసింది. ఇప్పటికే ఉక్రెయిన్ చేరుకున్న రష్యా సైనికులు.. అక్కడ తమ సొంత వాహనాలను ధ్వంసం చేస్తున్నట్టు 'న్యూయార్క్ టైమ్స్' ఓ కథనాన్ని ప్రచురించింది. ఉక్రెయిన్ ప్రజలపై తూటాలు కురిపించడం ఇష్టంలేక చాలామంది రష్యన్ సైనికులు కన్నీరు పెట్టుకుంటున్నారని, యుద్ధాన్ని తప్పించేందుకు తమ వంతుగా వాహనాలను తగులబెడుతున్నారని వివరించింది. అమెరికా రక్షణశాఖ కార్యాలయానికి చెందిన ఓ అధికారిని ఉటంకిస్తూ ఈ వివరాలను వెల్లడించింది.
''రష్యా సైనికుల్లో చాలామంది యువతే ఉన్నారు. వీరికి తగినంత శిక్షణ లేదు. పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్ధం కాలేదు. ఆహారం లేక అలమటిస్తున్నారు. వాహనాలకు సరిపడా ఇంధనం కూడా వారి దగ్గర లేదు. యుద్ధాన్ని నివారించే ఉద్దేశంతో తమ వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఉక్రెయిన్‌కు చిక్కిన రష్యన్ సైనికులు ఈ విషయాలు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యన్ కమాండర్లు తమ వ్యూహాలను మార్చే అవకాశముంది'' అని ఆ కథనం పేర్కొంది.
బ్రిటన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ షాడోబ్రేక్ కూడా ఈ నివేదికలోని వాదనలను బలపరుస్తూ రేడియో సందేశమిచ్చింది. మరోవైపు- ఉక్రెయిన్ పట్టణాలు నాశనమయ్యేలా వాటిపై బాంబులు విసరాలన్న తమ కమాండర్ల ఆదేశాలను యుద్ధ క్షేత్రంలో ఉన్న రష్యన్ సైనికులు ధిక్కరిస్తున్నట్టు డైలీ మెయిల్ రికార్డు చేసిన సందేశాలను బట్టి తెలుస్తోంది.
ఇవీ చూడండి: రెండోసారి పుతిన్‌తో మోదీ ఫోన్ సంభాషణ