వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి లండన్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. నీరవ్ మూడోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. 2 మిలియన్ పౌండ్ల పూచీకత్తు సమర్పించేందుకు అంగీకరిస్తూ ఈ సారి బెయిల్ కోసం దరఖాస్తు చేశారు నీరవ్. అవసరమైతే 24 గంటలు లండన్‌లోని నీరవ్ నివాసంలో భద్రతను ఏర్పాటు చేయవచ్చని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించినా ఫలితం దక్కలేదు.
"జైలులోని పరిస్థితులు జీవించేందుకు అనుకూలంగా లేవు. మీరు ఏ నిబంధనలు విధించినా అనుసరించేందుకు నీరవ్ సిద్ధంగా ఉన్నారు."
-క్లేర్ మాంట్గొమేరి, కోర్టులో నీరవ్ తరఫు న్యాయవాది
నీరవ్ తరఫు న్యాయవాది వాదనలతో ప్రధాన న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. నీరవ్ చాలా పెద్ద మోసానికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు. ఆయన కోర్టు ముందు లొంగిపోకపోతే రెట్టింపు చేసిన పూచీకత్తు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు.
భారత్ తరఫున బ్రిటన్ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించింది. నీరవ్‌కు బెయిల్ మంజూరు చేయకూడదని కోర్టును అభ్యర్థించింది. నీరవ్ తరఫు న్యాయవాదులు సమర్పించిన వివరాలు పరిస్థితులను మార్చేందుకు ఏ విధంగానూ ఉపకరించవని చెప్పింది.
మార్చి 20న జిల్లా కోర్టులో మొదటిసారిగా నీరవ్ బెయిల్ దరఖాస్తు తిరస్కరణకు గురైంది. మార్చి 29న లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేశారు నీరవ్. ఈ దరఖాస్తును తిరస్కరించారు ప్రధాన న్యాయమూర్తి. ఇప్పుడు మూడోసారి పూచీకత్తును రెట్టింపు చేసి బెయిల్‌కు విన్నవించినా నీరవ్‌కు నిరాశే ఎదురైంది.
ఇదీ చూడండి: ఆంక్షలపై ఇరాన్ ఎదురుదాడి- ఎత్తివేతకు డెడ్‌లైన్