కరోనా.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరికీ వణుకు వస్తుంది. చిన్నా పెద్దా ఈ వైరస్ బారిన పడకుండా రక్షించుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా రొమేనియా ప్రధాన మంత్రి లుడోవిక్ ఓర్బన్ నేటి నుంచి స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. అక్కడి నుంచే తన విధులు నిర్వర్తిస్తానని చెప్పారు.
అసలు కారణం ఇదే..
సోమవారం లుడోవిక్ ఓ రాజకీయ సమావేశానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి హాజరైన ఓ సెనేటర్‌కు కరోనా సోకినట్లు ఆలస్యంగా తెలిసింది. తనకు కూడా వైరస్ సోకినట్లు అనుమానించిన ప్రధాని... నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఓర్బన్‌తో పాటు ఆ సమావేశానికి హాజరైన మంత్రులకూ కరోనా పరీక్షలు చేస్తున్నారు.
రొమేనియాలో ఇప్పటివరకు 70 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి దృష్ట్యా అన్ని విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థలను మూసివేసింది అక్కడి ప్రభుత్వం. ఇటలీ సహా అనేక దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆంక్షలు విధించింది.
ఇదీ చదవండి: కరోనాపై చైనా విజయం.. కొత్త కేసులు తగ్గుముఖం