భారత ప్రధాని నరేంద్ర మోదీ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని 'రిపోర్టర్స్ వితౌట్ బార్హర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్)' అనే అంతర్జాతీయ సంస్థ ఆరోపించింది. మీడియా అండతో ఆయన తన సిద్ధాంతాలను విసృతంగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న నేతల పేర్లతో ఆర్‌ఎస్‌ఎఫ్ ఓ జాబితాను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా 37 మంది దేశాధినేతలు/ ప్రభుత్వాధినేతలకు అందులో చోటుకల్పించింది. మోదీతో పాటు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, మయన్మార్ మిలటరీ అధ్యక్షుడు మిన్ అంగ్ లయాంగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఇందులో ఇద్దరు మహిళలు (బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేరీ లామ్) కూడా ఉన్నారు.
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న నేతల జాబితాను ఈ సంస్థ ప్రచురించడం 2016 తర్వాత ఇదే తొలిసారి. 2001లో మొదటిసారిగా దీన్ని ప్రచురించారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సద్, ఇరాన్‌కు చెందిన అలీ ఖమేనీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బెల్లారస్‌కు చెందిన అలెగ్జాండర్ లుకషెంకో తొలి నుంచీ ఈ జాబితాలో కొనసాగుతున్నారు. 2021కి సంబంధించి 180 దేశాలతో ఆర్‌ఎస్‌ఎఫ్ రూపొందించిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ 142వ స్థానంలో ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి : 91 దేశాల జాతీయ గీతాలను పాడి రికార్డు