యావత్ ప్రజానీకం ఆరోగ్య విషయంలో డబ్ల్యూహెచ్ఓ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) పాత్ర ఎంతో కీలకం. అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆ సంస్థ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు కరోనా 2.0 పంజా విసురుతున్న నేపథ్యంలో సంస్థ అంతర్గత సమావేశాలకు సంబంధించిన రికార్డింగ్స్ ఓ ప్రముఖ వార్తా సంస్థ చేతికి చిక్కాయి. ఫలితంగా డబ్ల్యూహెచ్ఓ పనితీరుపై మరోమారు ప్రశ్నల వర్షం కురుస్తోంది. సంస్కరణలు చేయాలని సంస్థపై ఒత్తిడి పెరుగుతోంది.
'ఆ ల్యాబ్ దురదృష్టం'
వైరస్ విజృంభించిన తొలినాళ్లలో ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలపై ప్రశంసల వర్షం కురిపించింది డబ్ల్యూహెచ్ఓ. వైరస్ కట్టడిలో అవి చేస్తున్న కృషిని అభినందించింది. అయితే.. 'వైరస్‌పై అధ్యయనం జరగడం ఆ ల్యాబొరేటరీ దురదృష్టం' అంటూ సంస్థ అత్యున్నత వైద్యులు, నిపుణులు అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించడం ఆ రికార్డింగ్స్‌లో ఉన్నాయి. దీనిపై ఇప్పుడు పెద్దస్థాయిలోనే చర్చ జరుగుతోంది.
ఇదీ చూడండి:- బైడెన్ 'కొవిడ్ టాస్క్‌ఫోర్స్'లో భారతీయ అమెరికన్!
సభ్య దేశాలపై చర్యలేవి?
ప్రభావితమైన దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్ దేశాలున్నాయి. డబ్ల్యూహెచ్ఓకు వీటి ద్వారా నిధులు భారీగా అందుతుంటాయి. అయితే ఆయా దేశాలు ఎన్ని తప్పులు చేసినా.. వాటిని డబ్ల్యూహెచ్ఓ నిలదీయకపోవడం గమనార్హం. ఫలితంగా ప్రపంచ దేశాలు భారీ స్థాయిలో నష్టాన్ని చూడాల్సి వచ్చింది. వీటికి సంబంధించిన రికార్డింగ్స్, పత్రాలను కూడా ఆ వార్తా సంస్థ చేతికి చిక్కాయి.
సభ్యదేశాలపై డబ్ల్యూహెచ్ఓ కఠినంగా ఉండి ఉండే పరిస్థితులు మరోలా ఉండేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బైడెన్ మాట నిలబెట్టుకునేనా?
ఈ ఏడాది జూన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డబ్ల్యూహెచ్ఓ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంస్థ నుంచి వైదొలిగారు. అప్పటి నుంచి ఆరోగ్య సంస్థ ఆర్థికంగానూ నష్టపోయింది.
ఇంతటి తీవ్ర ఒత్తిడిలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ... ఇప్పుడు అమెరికావైపు ఆశగా చూస్తోంది. తాను ఎన్నికల్లో గెలిస్తే సంస్థకు అందించాల్సిన నిధులపై కోతను తొలగిస్తానన్న జో బైడెన్.. తన మాటను నిలబెట్టుకుంటారని ఆశాభావంతో ఉంది.
ఇదీ చూడండి:- బైడెన్, హారిస్‌లకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ అభినందనలు