బ్రిటన్‌లో కరోనా టీకా పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. వాక్సిన్ కావాలంటే బ్యాంకు వివరాలతో పాటు నగదు చెల్లించాలని అడుగుతున్నట్లు బ్రిటన్ జాతీయ నేర గణాంక విభాగం (ఎన్సీఏ) తెలిపింది. వృద్ధులు, వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నవారినే సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంది. తాను టీకా పంపిణీ చేసే వ్యక్తి నంటూ ఓ వ్యక్తి.. 92 ఏళ్ల మహిళ నుంచి 160 పౌండ్లు తీసుకున్నట్లు తెలిపింది.
టీకా ఉచితం
కరోనా వ్యాక్సిన్లు జాతీయ ఆరోగ్య సేవా ఆసుపత్రుల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ఇందుకు ప్రజల నుంచి ఎటువంటి వ్యక్తిగత వివరాలను అడగమని స్పష్టం చేసింది. టీకాను పొందాలంటే బ్యాంకు వివరాలు, డబ్బు చెల్లించాలని అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ప్రజల్ని కోరింది. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇప్పటి వరకు టీకాకు సంబంధించిన 57 సైబర్ మోసాల కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చూడండి: జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ షురూ