స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న ప్రపంచ వాతావరణ సదస్సు(కాప్26)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి ముందు ప్రవాస భారతీయుల సంఘానికి చెందిన నాయకులు, విద్యార్థులను కలిశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెకీ అనిల్‌తో సరదాగా ముచ్చటించారు మోదీ. 'మాది ఆంధ్రప్రదేశ్' అ ని చెప్పగానే.. 'ఓ ఆంధ్రా గారూ..' అంటూ మోదీ సంబోధించారు. ఈ విషయాన్ని అనిల్ వెల్లడించారు.
" నేను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడినని మోదీకి చెప్పగానే.. 'ఓ ఆంధ్రా గారూ, చాలా సంతోషం' అని చెప్పారు. ప్రభుత్వం చేపడున్న సంస్కరణలతో, ముఖ్యంగా మోదీ జీ నాయకత్వంలో ఐటీ విభాగంలో భారత్ ఎలా అభివృద్ధి చెందుతుంతో మీరు చూడొచ్చు."
- అనిల్, ఐటీ నిపుణుడు.
కాప్26 సదస్సులో ప్రపంచ నేతలతో పాటు ప్రధాని మోదీని చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు స్కాట్లాండ్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి మహిళ పామ్ గోసాల్. మోదీని కలవటంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని పర్యావరణపరంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏదో ఒక విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరు నిర్ధరించుకోవటం చాలా ముఖ్యమన్నారు.
మోదీ విగ్రహం..
ప్రధాని మోదీని కలిసిన వారిలో నాడే కహిమ్.. ఆయన విగ్రహాన్ని రూపొందించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 'మోదీని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అందుకే ఆయన విగ్రహం తయారు చేయాలనుకున్నా. దీనిని చూశాక ఆయన సంతోషించారని అనుకుంటున్నా. ఇంతకు ముందు ఆయనతో నేను మాట్లడలేదు, కానీ నాతో ఒక సోదరునిలా మాట్లాడారు,' అని పేర్కొన్నారు.