ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ క్షీణిస్తున్నట్లు మానవ హక్కుల కాపలా సంస్థ ఒకటి తెలిపింది. చాలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేసే ధోరణులు అవలంభిస్తుండడమే ఇందుకు కారణంగా పేర్కొంది.
'ఫ్రీడమ్ హౌస్' సంస్థ తన వార్షిక నివేదికలో ఐరోపాలో గుర్తించదగ్గ స్థాయిలో పత్రికా స్వేచ్ఛ క్షీణించినట్లు పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాను దూషించడం వంటి చర్యలు.. ప్రధాన సమాచార మాధ్యమాలపై ప్రజలకు నమ్మకం క్షీణించేలా చేస్తున్నాయని వెల్లడించింది నివేదిక.
"ట్రంప్ ప్రయత్నమంతా పత్రికా స్వేచ్ఛను అణగదొక్కాలనే. జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తే వారంతా తమకు అనుకూలంగా మారతారని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన దేశాధినేతలు కూడా మీడియా స్వేచ్ఛను అణగదొక్కడానికే యోచిస్తున్నారు." - ఫ్రీడమ్ హౌస్
కొన్ని ప్రజాస్వామ్య దేశాల్లోనూ చాలా వరకు నిష్పక్షపాతమైన సమాచారాన్ని, వార్తలను ప్రజలు పొందలేకపోతున్నారని.. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రభుత్వాల చర్యలే ఇందుకు కారణమని తెలిపింది నివేదిక.
మీడియాపై ప్రభుత్వ పెత్తనం
రష్యాలో అతిపెద్ద జాతీయ వార్తా పత్రికను ఆ దేశ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ పత్రికను అధికారపక్ష వార్తలకోసం వినియోగిస్తోంది. చైనాలో ఆ దేశ మీడియాపై అధికార కమ్యూనిస్టు తన ప్రభావాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
అధిపతుల నియంత్రణలోనే మీడియా
మీడియాను అదుపు చేయడంలో హంగేరి ప్రధాని విక్టర్ అర్బన్, సైబీరియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుకిక్లు విజయవంతమయ్యారని పేర్కొంది ఫ్రీడమ్ హౌస్.
ఆయా దేశాల్లో మీడియాను ప్రభుత్వ అనుకూల యాజమాన్యాలకు అప్పగించడం ద్వారా వాటిని అదుపుచేస్తున్నారని తెలిపింది. ఈ అంశం ఇతర దేశాధినేతలనూ అలోచింపజేసేలా చేస్తోందని నివేదిక స్పష్టం చేసింది.
ఈ దేశాల్లో స్వేచ్ఛ పెరిగింది
ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ తగ్గుతున్న వేళ.. ఇథియోపియా, మలేషియా, ఈక్వెడార్, గాంబియా వంటి దేశాల్లో పత్రికా స్వేచ్ఛ కాస్త పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
ఇదీ చూడండి: 'ఏఎన్-32' కోసం గాలింపు చర్యలు ముమ్మరం