జాన్ బెర్కో... బ్రిటన్.. హౌస్ ఆఫ్ కమెన్స్కు 157వ స్పీకర్. అయితే బ్రెగ్జిట్ చర్చకు వచ్చిన ప్రతిసారి అందరి చూపు జాన్ బెర్కో వైపే ఉంటుంది. ఇందుకు కారణం లేకపోలేదు. పార్లమెంటులో బ్రెగ్జిట్‌పై జరిగిన వాడివేడీ చర్చల్లో ఆయన వ్యవహరించిన తీరు ఎంతోమంది ఐరోపా వాసుల మనసుల్ని గెలుచుకున్నాయి.
156వ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజీనామా వరకు 14 వేల కన్నా ఎక్కువ సార్లు తనదైన రీతిలో 'ఆర్డర్! ఆర్డర్' అన్నారు 56 ఏళ్ల బెర్కో. బెర్కోను కొంతమంది విమర్శించినప్పటికీ... ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అందరికీ అవకాశం కల్పించేవారని ఆయన మద్దతుదారులు కొనియాడతారు. ఆయన రాజీనామాకు ముందు.. చివరి పార్లమెంటు సెషన్లో బెర్కో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చట్ట సభ్యులు ఆయనపై ప్రశంసలు కురిపించారు.
"కొన్ని విషయాల్లో మిమ్మల్ని వ్యతిరేకించినప్పటికీ... ఈ పార్లమెంటు, హౌస్ ఆఫ్ కమెన్స్కు మీరు గొప్ప సేవకులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు." - బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని
"హౌస్ ఆఫ్ కమెన్స్ను సంస్కరించడం కోసం మీరు ఎంతో చేశారు. ఆ సంస్కరణల వల్లే మన దేశ ప్రజాస్వామ్యం మరింత శక్తిమంతమైంది." - జెరెమీ కార్బన్, లేబర్ పార్టీ నేత
డిసెంబర్ 12న జరగనున్న సాధారణ ఎన్నికలకు జాన్ బెర్కో దూరంగా ఉండనున్నారు. ఆయన రాజీనామా చేయడం వల్ల సభాపతిగా మరొకరిని సోమవారం ఎన్నుకోనుంది సభ. ఇందుకోసం 9 మంది పోటీలో ఉన్నారు.
1997లో తొలిసారి ఎంపీగా నెగ్గారు బెర్కో. 12 ఏళ్ల తర్వాత ఆయన సభాపతిగా ఎన్నికయ్యారు. 100 ఏళ్ల దేశ చరిత్రలో అతి చిన్న వయసులో ఆ స్థానానికి చేరిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
ఆయన సభాపతిగా ఉన్న కాలంలో బ్రెగ్జిట్ కారణంగా తీవ్ర ప్రతిష్టంభన ఎదుర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకసారి.. బ్రిటన్ పార్లమెంటులో ప్రసగించేందుకు బెర్కో అనుమతి నిరాకరించారు.
- ఇదీ చూడండి: బాగ్దాదీ పోయాడు.. ఇప్పుడు మా నాయకుడు ఖురేషీ: ఐసిస్