భారత్‌లో అత్యధికంగా వ్యాపించిన కరోనా డెల్టా(బి.1.617) వేరియంట్(Delta Variant) మొత్తంలో ఒక స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ రకం వేరియంట్ వైరస్ మళ్లీ మూడు స్ట్రెయిన్లుగా మారిందని.. వాటిల్లో కూడా బి.1.617.2 రకం మాత్రం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోందని వెల్లడించింది.
గత నెల బి.1.617ను 'ఆందోళనకర వేరియంట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇప్పుడు దీనిలో కూడా బి.1.617.2 స్ట్రెయిన్ మాత్రమే 'ఆందోళనకర వేరియంట్' హోదాకు అర్హమైందని పేర్కొంది. మిగిలిన రెండు స్ట్రెయిన్లు తక్కువగా వ్యాపిస్తున్నట్లు గమనించామని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతివారం విడుదల చేసే నివేదికలో భాగంగా ఈ వివరాలు వెల్లడించింది. ఈ రకం వైరస్ వ్యాపిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతన్నట్లు తాము గమనించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో ఈ వైరియంట్‌పై పరిశోధనలకు ప్రాధాన్యమిస్తామని తెలిపింది. బి.1.617.1 స్ట్రెయిన్ స్థాయిని తగ్గించగా.. బి.1.617.3 స్ట్రెయిన్‌ను గమనిస్తుండాలని పేర్కొంది. వేరియంట్లను కనుగొన్న ప్రదేశాల పేర్లను పెట్టడం వల్ల తలెత్తే ఇబ్బందులు తొలగించడానికే గ్రీకు పదాలను వాడినట్లు పేర్కొన్నారు.
నిర్వాసితుల్లోనూ..
భారత్‌లో తీవ్రంగా వ్యాపించిన మొదటి వైరస్ వేరియంట్(Delta Variant).. నిరాశ్రయుల్లోనూ తీవ్రంగా వ్యాపించే ప్రమాదముందని ఐరాస రెఫ్యుజీస్ హైకమిషనర్ ప్రతినిధి ఆంద్రేజ్ మహెసిక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:COVID: ఈ ఔషధంతో కొత్త వేరియంట్లకూ చెక్!