ప్రపంచ జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో సోకే అవకాశముందని ఇటీవలి ఓ అధ్యయనం తెలిపింది. ఈ మేరకు బ్రిటన్‌లోని 'లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రొపికల్ మెడిసిన్'కు చెందిన నిపుణుల బృందం తమ పరిశోధనా ఫలితాలను వెల్లడించింది. వివిధ ప్రభుత్వాలు, సంస్థలు అధికారికంగా వెల్లడించిన కొవిడ్-19 ప్రమాద కారకాలను, అంటువ్యాధులకు సంబంధించిన విస్తారమైన గణాంకాలను, సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని విశ్లేషించిన అనంతరం తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు నిపుణులు తెలిపారు. వీరి అధ్యయనం ప్రకారం...
- ప్రపంచ జనాభాలో 20 శాతం కంటే ఎక్కువ మంది.. అంటే ఐదుగురిలో ఒకరు ఏదో ఒక ఆరోగ్య సమస్యను కలిగిఉన్నారు. వీరికి కరోనా ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో తెలుస్తోంది.
- ఇక కొవిడ్ ముప్పును పెంచే రుగ్మతల్లో టైప్-2 మధుమేహం, గుండె సమస్యలు ముఖ్యమైనవని వెల్లడించారు. ఇవే కాకుండా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు.
- యువ జనాభా అధికంగా ఉన్న ఆఫ్రికా వంటి ప్రదేశాల్లో కొవిడ్ విరుచుకుపడే ప్రమాదం తక్కువ.
- సరాసరి వయస్సు అధికంగా ఉండి, సుమారు మూడోవంతు జనాభా ఏదో ఒక ఆరోగ్య సమస్యను కలిగి ఉన్న యూరోపియన్ దేశాలకు కరోనా నిరోధకత స్వల్పంగా ఉంటుంది.
ప్రపంచ వ్యాప్త కొవిడ్ గణాంకాలు 81లక్షలు దాటాయి. కరోనా కేసులు, మరణాలు ఆందోళనకరంగా పెరుగుతున్న ఈ నేపథ్యంలో... కొవిడ్‌కు వ్యాక్సిన్ కనుగొన్నపుడు దానిని ముఖ్యంగా ఎవరికి అందజేయాలనే ప్రాధాన్యాలను ప్రభుత్వాలు నిర్ణయించేందుకు తమ అధ్యయనం ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఇదీ చూడండి:- మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగం దశకు బ్రిటన్