ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనాను రూపుమాపగలమనే నమ్మకం వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు. వైరస్ను నివారించడానికి ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా 90శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా టీకాలు సమర్థంగా పని చేస్తున్నట్లు ప్రకటించగా... ఆది నుంచి ఆశాకిరణంగా మారిన ఆక్సఫర్డ్ టీకా మూడోదిగా అవతరించింది.
"చరిత్రలో ఏ వ్యాధికి ఇంత త్వరగా వ్యాక్సిన్ అభివృద్ధి జరగలేదు. వ్యాక్సిన్ తయారీలో ఇదో గొప్ప విజయం. ఈ శాస్త్రీయపరమైన విజయం గురించి ప్రస్తావించకుండా ఉండలేం. టీకా అభివృద్ధిలో ఇదో మైలురాయిగా చెప్పవచ్చు. అయితే టీకా అందుబాటులోకి రావడం ఎంత కీలకమో.. పంపిణీ చేయడం కూడా అంతే కీలకమే."
- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్
వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు, పేద దేశాలకు టీకా పంపిణీ సక్రమంగా జరిగేలా చూసేందుకు ఏర్పాటు చేసిన 'కొవిడ్-19 టూల్స్'లో 187 దేశాలు చేరాయి. చవక ధరల్లో అన్ని దేశాలకు సకాలంలో వ్యాక్సిన్ పంపిణీ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటుంది డబ్ల్యూహెచ్ఓ.
4.3 బిలియన్ డాలర్లు అవసరం..
టీకా పంపిణీ, టెస్ట్లు, చికిత్స కోసం 4.3 బిలియన్ డాలర్లు తక్షణమే అవసరమని అథనోమ్ పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి అదనంగా 23.8 బిలియన్ డాలర్లు అవసరమని తెలిపారు.
ఇదీ చూడండి: 'చైనాను ఎదుర్కొవడంలో అమెరికాకు భారత్ కీలకం'