కరోనా వైరస్‌లో కొత్తగా 'లాంబ్డా' అనే వేరియంట్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇది అనేక దేశాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) దీన్ని 'దృష్టిసారించాల్సిన రకంగా (వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్)' ప్రకటించింది. బ్రిటన్‌లోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(పీహెచ్ఈ) కూడా దీన్నీ 'పరిశోధనలో ఉన్న కరోనా రకంగా' వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది విస్తరించడం.. దీన్ని స్పైక్ ప్రోటీన్ ఎల్452క్యూ, ఎఫ్490ఎస్ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లో ఇప్పటివరకు ఆరు లాంబ్డా కేసులు వెలుగు చూశాయి.
ఇది తొలుత గతేడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఏప్రిల్ నుంచి పెరూలో బయటపడిన కొవిడ్ కేసుల్లో ఈ వేరియంట్ వాటా 81శాతం మేర ఉండటం గమానార్హం. గత 60 రోజుల్లో ఇది చిలీలో 32శాతానికి పెరిగింది. ఈ వేరియంట్ వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందనడానికి గానీ, ప్రస్తుత టీకాలను ఏమారుస్తుందనడానికి గానీ ఎలాంటి ఆధారాల్లేవని పీహెచ్ఈ పేర్కొంది.
అయితే దీని స్పైక్ ప్రోటీన్‌లోని కొన్ని ఉత్పరివర్తనలు వల్ల ఇది ఉద్ధృతంగా వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పీహెచ్ఈ తెలిపింది.
ఇదీ చూడండి: మార్స్‌పై ల్యాండింగ్ ఫుటేజ్ పంపిన చైనా రోవర్