బ్రెగ్జిట్ గడువు పొడిగింపునకు ఐరోపా సమాఖ్య దేశాలు అంగీకరించాయి. ఫలితంగా... ఈయూ నుంచి విడిపోయేందుకు బ్రిటన్‌కు అక్టోబర్ 31 వరకు సమయం లభించింది. బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో పాటు 27 ఈయూ దేశాల నేతలు దాదాపు ఆరు గంటల పాటు చర్చించి ఈ నిర్ణయానికి వచ్చారు.
శుక్రవారమే వైదొలగాల్సింది
ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు శుక్రవారమే తుది గడువు. బ్రెగ్జిట్ బిల్లు బ్రిటన్ పార్లమెంటులో ఇప్పటికే మూడు సార్లు తిరస్కారానికి గురైంది. ఫలితంగా... ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సమావేశానికి థెరిసా మే పట్టుబట్టారు. జూన్ 30 వరకు గడువు పొడిగించాలని ఈయూని కోరారు.
ఒప్పందం లేకుంటే తీవ్ర నష్టమే
ఎలాంటి ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగితే తీవ్ర సమస్యలు ఎదురవుతాయని ఆర్థిక వేత్తలు, వ్యాపార వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సహా భారతీయ మార్కెట్లపైనా ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పర్యటక రంగం చిక్కుల్లో పడుతుంది. సుంకాలు, తనిఖీల వల్ల బ్రిటిష్ పోర్టుల్లో కార్యాకలాపాలు నిలిచిపోతాయి. సరుకుల కొరత ఏర్పడుతుంది. బ్రిటన్, ఈయూ దేశాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. అందుకే.. గడువు పొడగింపునకు ఈయూ దేశాలు మొగ్గుచూపాయి.
అడిగింది జూన్ 30, ఇచ్చింది అక్టోబర్ 31
బ్రెగ్జిట్ అమలుకు గడువును జూన్ 30 వరకు పెంచితే చాలని ఈయూను బ్రిటన్ ప్రధాని థెరిసా మే కోరారు. అప్పటిలోగా పార్లమెంటు ఒప్పందానికి ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకుంటామనే విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఈయూ నేతలు అక్టోబర్ 31వరకు గడువు పొడిగింపునకు ఈయూ దేశాధినేతలు నిర్ణయించారు.
గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ ఏడాది మార్చి 29నే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాల్సింది.
థెరిసా ఏమనుకుంటున్నారు?
జూన్ 30 తర్వాత ఈయూతో కలిసి ఉండేందుకు థెరిసా మే సుముఖంగా లేరు. ఈ విషయాన్ని ఇటీవలే వెల్లడించారు. ఒక్కసారి బ్రెగ్జిట్‌కు పార్లమెంటు ఆమోదం లభిస్తే తక్షణమే ఈయూ నుంచి వైదొలుగుతామని చెప్పారు.
ప్రతిపక్ష నేతతోనూ చర్చలు
బ్రిటన్ ఎంపీలు పార్లమెంటులో బ్రెగ్జిట్ ఒప్పందాన్ని మూడుసార్లు తిరస్కరించారు. కొత్త ప్రతిపాదనలతో మరోమారు పార్లమెంటుకు ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు మే. ఇందుకు సహకరించాలని కోరుతూ ప్రతిపక్ష లేబర్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.