ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 15,495మంది మరణించారు. ఐరోపాలనే 10వేల మందికిపైగా చనిపోయారు. కేసుల సంఖ్య 3,60,000 దాటింది. ఐరోపా, అమెరికాలో నిత్యం వందలాది ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యంత భయానకంగా మారిన ఇటలీలో మరణాల సంఖ్య గత రెండు రోజులతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. సోమవారం 601 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 6వేల 77కు చేరింది. ఇటలీలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 63వేల 927కు పెరిగింది. సోమవారం ఒక్కరోజే 4వేల 789 కేసులు బయటపడ్డాయి.
ఇటలీ తర్వాత స్పెయిన్‌లో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. సోమవారం 435 మంది చనిపోయారు. 4,321 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫ్రాన్స్‌లోనూ మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరోజులో 186 మంది మృతిచెందగా.. 3వేల 838 కేసులు నమోదయ్యాయి. ఇరాన్‌లో సోమవారం 127 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడగా.. 1,411 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అగ్రరాజ్యంలో
అమెరికాలోనూ కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. సోమవారం దాదాపు 100 మంది చనిపోయారు. 9వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 42 వేలు దాటాయి.
బ్రిటన్‌లోనూ 54మంది చనిపోగా, సుమారు వెయ్యి కొత్త కేసులు నమోదయ్యాయి. జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లో మృతులతోపాటు కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
కార్చిచ్చులా
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోందని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. మొదటి కేసు నమోదైనప్పటి నుంచి లక్షకు చేరడానికి 67 రోజులు పడితే 11 రోజుల్లోనే 2 లక్షలకు చేరిందని తెలిపింది. తర్వాత నాలుగు రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలకు చేరాయని గుర్తుచేసింది. అయితే పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోలేదని., వైరస్‌ను కట్టడి చేసే అవకాశాలు ఇంకా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కార్చిచ్చులా విస్తరిస్తోందని, కట్టడి చేసేందుకు అన్ని దేశాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియే గూటేరస్ అన్నారు.