కొవిడ్-19ను ఎదుర్కొనే ఔషధం వస్తుందని ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు దేశాలకు చెందిన పరిశోధనా సంస్థలు వ్యాక్సిన్ తయారీ దిశగా పనిచేస్తున్నాయి. అయితే ఆశావాదులందరికీ పిడుగులాంటి ఓ వార్త చెప్పారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. కరోనా వైరస్‌కు మందును ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఏడాది సమయం పట్టొచ్చని అభిప్రాయపడిన ఆయన.. పరిస్థితి అనుకూలించకపోతే అసలు మందు కూడా రాకపోవచ్చని అన్నారు. అయితే అందరం కలిసికట్టుగా ఉండి వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
" సాధారణ జీవితానికి ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజలందర్నీ ఓపికగా ఉండమని కోరుతున్నా. మనకు అవసరమైన వ్యవస్థలను నిర్మించుకునేందుకు లక్ష్యంవైపు పయనించాలి. పరిస్థితి చేయిదాటిపోయి, మనుషులు చనిపోతుననప్పుడు ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టి ఆంక్షలు విధించాల్సి వచ్చింది. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలి. వైరస్‌ను నియంత్రించాలి. అలా చేస్తేనే ప్రాణాలను కాపాడుకోగలం. వ్యాక్సిన్, చికిత్స అందుబాటులోకి వస్తే ఫర్వాలేదు. కానీ కరోనాతో కలిసి ఎక్కువకాలం జీవించాల్సి ఉంది"
-- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్డౌన్లో కొన్నిపాటి సడలింపులు ఇచ్చేందుకు బోరిస్ ప్రభుత్వం సిద్ధమౌతోంది. భౌతిక దూరం, పాటిస్తూనే.. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణలో భాగస్వాములవ్వాలని ప్రజల్ని కోరారు జాన్సన్. దశలవారీగా లాక్డౌన్ ఆంక్షలను తొలగించేందుకు 50 పేజీలతో కూడిన మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ వారం నుంచే దశవారీగా లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ప్రజలంతా భౌతిక దూరం పాటించడం, ఉద్యోగులు ఇళ్లనుంచే పనిచేయాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. నిర్మాణం, వస్తు తయారీ రంగంలో పనిచేసేవాళ్లు సామాజిక దూరం పాటిస్తూ.. కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు. వచ్చే నెల నుంచి కొన్ని దుకాణాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సెలూన్లు, పబ్‌లు, సినిమా థియేటర్లు మాత్రం జులై వరకు మూసివేసేలా ఆదేశాలిచ్చారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 100 పౌండ్ల నుంచి 3,200 పౌండ్ల జరిమానా విధిస్తున్నారు.