కరోనా వైరస్ వ్యాప్తితో పలు దేశాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా వారంపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. ప్రభుత్వ రవాణా సౌకర్యాలను బంద్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వైరస్‌ను కట్టడి చేయడానికి మార్కెట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు పేర్కొంది. లాక్డౌన్ భయంతో దేశ రాజధాని ఢాకాను వేలమంది వదిలివెళ్లిపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై చిన్న వ్యాపారులు ఆందోళనలు చేపట్టారు. వైరస్‌ను నియంత్రించడానికి సహకరించాలని ప్రజలను ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కోరారు.
బంగ్లాదేశ్‌లో 7,087 కొత్త కోసులు తాజాగా వెలుగుచూశాయి. 53 కొవిడ్ మరణాలు సంభవించాయి.
ఫిలిప్పీన్స్‌లో లాక్డౌన్ పొడగింపు..
కరోనా వ్యాప్తితో ఫిలిప్పీన్స్‌లో లాక్‌డౌన్‌ను మరోవారం పాటు పొడిగిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ విధించి వారం దాటినా వైరస్ వ్యాప్తిలో ఏ మార్పు లేకపోవటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ఐసీయూల్లో పరిమితికి మించి రోగులు చికిత్స పొందుతున్నారు. రోమన్ క్యాథలిక్‌లు ఈస్టర్ వేడుకలను ఆన్లైన్లోనే జరుపుకున్నారు.
లాక్డౌన్ విధించినా ఫిలిప్పీన్స్‌లో గత వారం రోజూవారి కరోనా కేసులు 10,000 దాటాయి. ఇప్పటి వరకు 7,95,000 కరోనా కేసులు నమోదయ్యాయి. 13,425 మంది వైరస్ బారినపడి మరణించారు.
బ్రిటన్‌లో ప్రతివారం రెండుసార్లు పరీక్షలు..
బ్రిటన్‌లో ప్రజలకు ప్రతివారం రెండుసార్లు కరోనా పరీక్షలు ఉచితంగానే చేయనున్నట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది. స్థానిక టెస్టింగ్ కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం కావాలంటే పరీక్షలను ఎక్కువగా నిర్వహించి వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో టెస్టింగ్‌లు చాలా అవసరమని చెప్పారు.
పాఠశాలల్లో, 10మంది దాటిన కంపెనీల్లో ప్రతిరోజూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 3 కోట్ల 14 లక్షల మంది మొదటి డోసును తీసుకున్నారు.