అనుకున్నంతా అయింది. ఉక్రెయిన్‌పై కత్తిగట్టిన రష్యా.. అదను చూసి సమరశంఖం పూరించింది. ముందస్తు వ్యూహం ప్రకారం గురువారం తెలతెలవారుతూనే బెలారస్ వైపు నుంచి సైనిక బలగాలతో ఉక్రెయిన్‌లో ప్రవేశించింది. దూకుడుగా మున్ముందుకు వెళ్తోంది.
కీలకమైన గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక వైమానిక స్థావరాలు, రక్షణ శాఖ ఆయుధాగారాలపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించే ఆయుధాలతో రష్యా దాడులు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జనం భయంభయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తరలిపోతున్నారు. సురక్షిత ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నాలు చేస్తుండడంతో రోడ్డు మార్గాలు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. దీంతో గందరగోళ, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
యుద్ధం దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఉక్రెయిన్‌ను కబళించాలన్న ప్రయత్నం తగదని ప్రపంచ దేశాలు పేర్కొన్నాయి. యుద్ధం వల్ల పెద్దఎత్తున ప్రాణనష్టంతో పాటు ఆర్థిక రంగంపై తీవ్రంగా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశాయి. ఉక్రెయిన్‌ను రక్షించడానికి సైనికపరంగా తాము జోక్యం చేసుకోబోమని అమెరికా వంటి దిగ్గజ దేశాలు ప్రకటించాయి.
రష్యాపై కొత్త ఆంక్షలు విధించడం ఖాయమని అమెరికా, ఈయూ తెలిపాయి. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి సురక్షితంగా తరలించడంపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్లో మాట్లాడారు. హింసకు వెంటనే తెరదించాలని కోరారు. భారతీయుల్ని ఉక్రెయిన్ నుంచి క్షేమంగా తరలించడం తమ ప్రాధాన్య అంశమని చెప్పారు.రష్యా దాడుల్ని ప్రతిఘటించడానికి ఇప్పటికే సమాయత్తమై ఉన్న ఉక్రెయిన్ ఆ మేరకు రంగంలో దిగింది.
కీవ్ సమీపంలో 14 మందితో ప్రయాణిస్తున్న సైనిక విమానం ఒకటి కూలిపోయిందని వార్తాసంస్థల సమాచారం. మొత్తంమీద ఉక్రెయిన్‌కు చెందిన 40 మంది, రష్యాకు చెందిన 50 మంది కలిపి 90 మంది వరకు సైనికులు మొదటిరోజే ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఒడెసా నగరంలో 18 మంది పౌరులు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. దీనిని ఉక్రెయిన్ ఇంకా ధ్రువపరచలేదు. రష్యాకు చెందిన ఐదు విమానాలను, ఒక హెలికాప్టర్‌ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. సాధారణ ప్రజలపై, జనావాసాలపై తాము దాడులు చేయడం లేదని, అది తమ లక్ష్యం కాదని రష్యా సైన్యం తెలిపింది. సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
ఉక్రెయిన్‌లో సైనిక మౌలిక సదుపాయాలు పూర్తిగా తమ సామర్థ్యాన్ని కోల్పోయాయని పేర్కొంది. 'పూర్తిస్థాయి యుద్ధం'లో తమ సైనిక కమాండ్ స్థావరాలపై క్షిపణి దాడులు జరిగాయని ఉక్రెయిన్ వెల్లడించింది. కీవ్, ఖార్కీవ్, ఒడెసా, ద్నిప్రో తదితర 13 నగరాల్లోని స్థావరాలు లక్ష్యంగా రష్యా దాడులు చేసిందని తెలిపింది.
సైనిక చర్య ఎందుకంటే..
"ఉక్రెయిన్‌ను ఆక్రమించాలన్న ఉద్దేశమేమీ మాకు లేదు. అక్కడి నుంచి నిస్సైనికీకరణ జరగాలనేదే మా ప్రయత్నం. అక్కడ నేరాలకు పాల్పడినవారిని చట్టం ముందు నిలబెడతాం. తూర్పు ఉక్రెయిన్ పౌరుల్ని రక్షించడానికే సైనిక చర్య అవసరమైంది. దీనిపై ఎవరైనా మా జోలికి వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి."
- పుతిన్
సైన్యం చొరబాటు ఇలా
తొలుత గగనతలం ద్వారా విరుచుకుపడ్డ రష్యా తన సైన్యాన్ని ఉక్రెయిన్‌లోకి పంపించింది. తర్వాత క్రిమియా మీదుగా భూభాగం ద్వారా సైనిక వాహనాల్లో బలగాలను తరలించింది. బెలారస్ నుంచి రష్యా దాడి మొదలైందని ఉక్రెయిన్ సరిహద్దు భద్రత సంస్థ తెలిపింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలన్నింటినీ తుడిచిపెట్టేశామని రష్యా సైన్యం ప్రకటించింది. గగనతల దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైకి క్షిపణులు దూసుకు రావచ్చనే సంకేతాలనిస్తూ సైరన్లు నిరంతరం మార్మోగుతూనే ఉన్నాయి. ఈ శబ్దం వినబడగానే ప్రజలు భూగర్భ మెట్రో స్టేషన్లు, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. కీవ్, సముద్ర తీర నగరమైన మారియూపోల్, దేశంలోని అతిపెద్ద నగరాలైన ఒడేసా, ఖార్కీవ్‌లలోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఉక్రెయిన్ గగనతలాన్ని ‘ఘర్షణల ప్రాంతం’గా ఐరోపా దేశాలు ప్రకటించాయి.
జోక్యం చేసుకున్నారో ఖబడ్దార్: రష్యా
రష్యా తమపై పూర్తిస్థాయి యుద్ధానికి దిగిందని ఉక్రెయిన్ ఆరోపించగా, దీనిని ‘భారీస్థాయి సైనిక చర్య’గా రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు. ప్రపంచ దేశాల ఖండనలు, తమపై విధిస్తున్న ఆంక్షలను తోసిపుచ్చారు. తమకున్న అణ్వాయుధ శక్తిని పరోక్షంగా గుర్తుచేస్తూ ఏ దేశమైనా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినా, తమపై నేరుగా దాడికి దిగినా ఎన్నడూ చూడనంత విపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టి హెచ్చరిక చేశారు. నాటో కూటమిలో చేరకుండా ఉక్రెయిన్‌ను అడ్డుకోవాలన్న తమ డిమాండును అమెరికా, దాని మిత్రపక్షాలు పట్టించుకోలేదని పుతిన్ నిందించారు. ఉక్రెయిన్ సైనికులు ఆయుధాలు విడిచిపెట్టి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. తమ పదాతిదళాలు ఉక్రెయిన్‌లో ప్రవేశించినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. రష్యా సరిహద్దులో నాటో సభ్యదేశమైన లిథువేనియా.. ఎమర్జెన్సీ ప్రకటించింది.
ప్రభుత్వ సైట్లపై సైబర్ దాడులు
ఉక్రెయిన్ పార్లమెంట్, బ్యాంకులు సహా ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్లపై మరోసారి సైబర్ దాడులు చోటు చేసుకున్నాయి. దీంతో కొన్ని సేవలు నిలిచిపోయాయి. పెద్ద సంస్థల్ని లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు.. విధ్వంసకర మాల్‌వేర్‌ను వందలాది కంప్యూటర్లలోకి చొప్పించారని అధికారులు వెల్లడించారు. లాత్వియా, లిథువేనియా దేశాల్లోని కంప్యూటర్లలోనూ వైరస్ దాడులు జరిగాయని చెప్పారు. సైనిక చర్యకు పాల్పడుతున్న రష్యానే.. సైబర్ దాడులు చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డేటాను పూర్తిగా తుడిచిపెట్టే సామర్థ్యం ఉన్న మాల్‌వేర్‌ను గుర్తించినట్లు ఈఎస్‌ఈటీ రీసెర్చ్ ల్యాబ్ తెలిపింది. ఎన్ని నెట్‌వర్క్‌లపై దీని ప్రభావం ఉందో ఇంకా తెలియలేదని పేర్కొంది.
ఇళ్లలోనే ఉండండి: జెలెన్‌స్కీ
రష్యాతో దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. దేశంలో మార్షల్ లా అమల్లోకి వచ్చిందని చెప్పారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అయితే భయపడవద్దని కోరారు. పుతిన్‌తో మాట్లాడేందుకు బుధవారం రాత్రి కూడా ప్రయత్నించినా క్రెమ్లిన్ నుంచి స్పందన రాలేదని చెప్పారు. తాజా పరిణామం ఐరోపా ఖండంలో పెద్ద యుద్ధానికి దారి తీయవచ్చన్నారు. దేశాన్ని రక్షించుకోవాలనుకునేవారికి ఆయుధాలు సమకూరుస్తామని చెప్పారు. దేశ భవిష్యత్తు ప్రతిఒక్క పౌరుడి ‘చేతి’లో ఉందన్నారు.
చెర్నోబిల్ స్వాధీనం
కీవ్‌కు 130 కి.మీ. దూరంలోని చెర్నోబిల్ అణు విద్యుత్తు కర్మాగారాన్ని రష్యా బలగాలు గుప్పిట్లో తీసుకున్నాయి. ఈ విషయాన్ని గురువారం రాత్రి పొద్దుపోయాక ఉక్రెయిన్ కూడా ధ్రువీకరించింది. రష్యా బాంబులు అక్కడి రేడియోధార్మిక వ్యర్థాల నిల్వలపైనా పడ్డాయనీ, దాంతో రేడియో ధార్మికత స్థాయి ఒక్కసారిగా పెరిగిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతంలో జరిగిన దుర్ఘటన తర్వాత ఈ కర్మాగారాన్ని సురక్షితంగా మూసి ఉంచారు.