ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించే విషయంలో భారత్‌లోని బ్రిటీష్ హైకమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనీలాండరింగ్ తదితర ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని భారత్‌కు అప్పగించడమనేది న్యాయపరమైన, కార్యనిర్వహణ ప్రక్రియ అని అన్నారు. పేరును ప్రస్తావించకుండా మాల్యాను, నీరవ్ మోదీని వెనక్కి రప్పించేందుకు రప్పించడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని, పడుతున్న తొందరను గుర్తిస్తున్నానని అన్నారు.
మాల్యాను భారత్‌కు పంపించడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది అని ప్రశ్నించగా ఈ విధంగా జవాబిచ్చారు.
''మాల్యాను భారత్‌కు పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఆయనను అప్పగించడం అనేది చట్టపరమైన విషయం. న్యాయస్థానాలు చూసుకుంటున్న విషయం కూడా. మా న్యాయస్థానాలు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయి. దీనికి షార్ట్‌కట్ లాంటివేమీ ఉండవు.
-అలెక్స్ ఎలిస్, భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్
అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్ క్రిస్టియన్ మైకేల్‌ను యూఏఈ నుంచి రప్పించి భారత్‌లో ఏకపక్షంగా నిర్భందించారని యూఎన్ వర్కింగ్ గ్రూప్ ఆరోపించిన విషయాన్ని మీడియా ప్రస్తావించిన మరుసటి రోజే ఎలిస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మైకేల్‌ను ఏకపక్షంగా నిర్భందించారన్న యూఎన్ వర్కింగ్ గ్రూప్ ఆరోపణలను భారత్ ఖండించింది. మైకేల్ విషయంలో అరకొర సమాచారం తెలుసుకుని, భారత న్యాయవ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకోకుండా యూఎన్ ప్యానెల్ ఆరోపణలు చేస్తోందని పేర్కొంది.
ఇదీ చూడండి: విజయ్ మాల్యా అప్పగింత ఇప్పట్లో కష్టమే!