ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఏటా పెరిగిపోతున్నాయి. ఐరోపా సమాఖ్య ఉపగ్రహ ఆధారిత నెట్వర్క్ తాజాగా ఓ నివేదికను వెల్లడించింది. 2019 జులై మాసంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. ఈ ఏడాదిలో నమోదైన ఉష్ణోగ్రతల్లో అత్యధికం జులై నెలలోనే కాగా, ప్రపంచ వ్యాప్తంగానూ ఇదే రికార్డు అని కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ ప్రతినిధి జీన్ నోయల్ థెపాట్ ఓ ప్రకటనలో తెలిపారు.
వాతావరణ మార్పులే కారణం
వాయు ఉద్గారాల ప్రభావంతోనే వాతావరణంలో మార్పులొస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు ప్రతిఏటా పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో ఇంకా తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం ఉంది.
అలస్కా, గ్రీన్లాండ్, సైబీరియా, మధ్య ఆసియా, ఇరాన్, అట్లాంటిక్ ప్రాంతాల్లో 1981 నుంచి 2010 వరకు నమోదైన ఉష్ణోగ్రతలను పోలిస్తే అత్యధికంగా పెరిగాయి. ప్రధానంగా సైబీరియా, అలస్కా లాంటి ప్రాంతాల్లో కార్చిచ్చు వల్ల అడవిలో మంటలు చెలరేగి 100 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రత
2019 జులైలో గత రికార్డు (2016 జులై) కంటే 0.04 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. 2015 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ 5 సంవత్సరాలు అత్యంత ఉష్ణోగ్రతలు కలిగిన కాలంగా చెప్పవచ్చు. 21వ శతాబ్దంలో ఏటా ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతూనే ఉంది.