ఇటలీని కరోనా వైరస్ కుదిపేస్తోంది. ప్రాణాంతక వైరస్‌తో తాజాగా 189 మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల ఇటలీలో మృతుల సంఖ్య 1,016కు చేరింది. వైరస్ విజృంభించిన రెండు వారాల్లోనే 1000కుపైగా మరణాలు సంభవించడం ఆ దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
గురువారం ఒక్క రోజే 2 వేల 651మందికి ఈ వైరస్ సోకింది. మొత్తం 15,113 మంది ఈ అంతర్జాతీయ మహమ్మారి బారిన పడ్డారు.
ప్రధాని భార్యకు వైరస్...!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం బ్రిటన్ నుంచి వచ్చిన సోఫియా.. దగ్గు, జలుబుతో సతమతవుతున్నారు. ప్రస్తుతం ఆమెకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యతో పాటు తాను కూడా స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు ప్రకటించారు ట్రూడో.
ప్రధాని.. తన ఇంటి నుంచి ఫోన్లు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉంటారని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
'ప్రజా ఆరోగ్య సంక్షోభం...'
కరోనా వైరస్‌ను 'అత్యంత దారుణ ప్రజా ఆరోగ్య సంక్షోభం'గా ప్రకటించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 590 కేసులే నమోదైనప్పటికీ... ఈ సంఖ్య 5 వేల నుంచి 10వేల మధ్యలో ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలి...
కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న తరుణంలో టోక్యో ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని సూచించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఖాళీగా ఉండే స్టేడియాల కన్నా మొత్తం ఒలింపిక్స్‌నే వాయిదా వేయడం మంచిదని అభిప్రాయపడ్డారు.