కరోనా నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్కు ముగింపు పలికి.. వచ్చే నెలలో తమ సరిహద్దులను తెరవనున్నట్లు ఇటలీ ప్రభుత్వం స్పష్టం చేసింది. వేసవిలో పర్యటక సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
దేశీయ, అంతర్జాతీయ సరిహద్దులను జూన్ 3 నుంచి తెరవనుంది ఇటలీ. విదేశాల నుంచి వచ్చే ఎవరికైనా 14 రోజుల నిర్బంధాన్ని తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటలీ స్థూల జాతీయోత్పత్తిలో 13 శాతం.. పర్యటక రంగం లాక్డౌన్ వల్ల క్షీణించింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో జీడీపీలో మెరుగుదల కనిపిస్తుందని ఆశిస్తోంది ప్రభుత్వం. టూరిజం నిర్వహకులూ ఈ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నారు.
జర్మనీ నుంచి వెనిస్ నగరానికి ఆస్ట్రియా మీదుగా 4 గంటల్లో ప్రయాణించవచ్చు. అయితే, జూన్ 15 వరకు ఎవరూ విదేశాలకు వెళ్లొద్దని తమ ప్రజలకు ఆదేశాలు జారి చేసింది జర్మనీ ప్రభుత్వం.
ప్రమాదంలో లక్షల ఉద్యోగాలు...
ఏప్రిల్ నాటికి పర్యటక రంగంలో లక్ష 6 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఇటలీ జాతీయ హోటల్ సమాఖ్య తెలిపింది. వేసవిలో పర్యటకులను అనుమతించకపోతే.. లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని వివరించింది.
లాక్డౌన్ కారణంగా పర్యటక కార్యకలాపాలను మూసేయడం వల్ల.. 10.8 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ఓ అధ్యయనం తెలిపింది. గతేడాది మార్చి నుంచి మే వరకు విదేశీ పర్యటకంపై వచ్చిన ఆదాయంతో ఇది సమానమని పేర్కొంది.