Indian Students in Ukraine: 'ప్రాణాలపై ఆశలు వదులుకున్నా. బతుకుతానని ఊహించలేదు. అదే చివరి రోజు అనిపించింది. అదృష్టవశాత్తు మృత్యువు కోరల నుంచి బయటపడ్డాను'.. 31 ఏళ్ల దిల్లీ యువకుడు హర్‌జోత్ సింగ్ అన్న మాటలివి. ఫిబ్రవరి 27న ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి వెళ్తున్న సమయంలో జరిగిన కాల్పులో ఆ విద్యార్థి గాయపడ్డాడు.
'ఆ రోజు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి క్యాబ్‌లో ఎల్వివ్‌కు బయలుదేరాం. ఇంతలో భీకరంగా కాల్పులు. తూటా ఒకటి నన్ను తాకింది. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు. స్పృహ వచ్చే సరికి ఆసుపత్రిలో ఉన్నా. అప్పటికి మూడు రోజులు గడచిపోయాయి. నాలుగు తూటాలు నా శరీరంలోకి వెళ్లాయి. వాటిలో ఒకటి ఛాతీలో దిగింది. కాలు విరిగి ఉంది. నా వెంట ఉన్న మిత్రులకు ఏమయ్యిందో తెలియలేదు. దేవుడి దయ వల్ల బతికాను’ అని శుక్రవారం ఫోన్‌లో వివరించారు.
కీవ్‌లోని ఇంటర్నేషనల్ యూరోపియన్ వర్సిటీ విద్యార్థి హర్‌జోత్. గత నెల 26న ఫోన్‌లో మాట్లాడిన కుమారుడు ఆ తర్వాత ఆచూకీలేకపోవడంతో ఆవేదనకు గురైనట్లు అతని తండ్రి, దిల్లీలోని ఛత్తార్‌పుర్ నివాసి కేశర్ సింగ్ మీడియాకు తెలిపారు. హర్‌జోత్ నుంచి ఫోన్ వచ్చే వరకూ తాము అనుభవించిన బాధ వర్ణనాతీతమన్నారు. భారతీయుల తరలింపు కోసం పోలండ్‌లో ఉన్న కేంద్ర సహాయ మంత్రి వి.కె.సింగ్ ఉక్రెయిన్‌లో మన దేశ విద్యార్థి ఒకరు గాయపడినట్లు వెల్లడించారు. ఆ తర్వాత క్షతగాత్రుడి వివరాలు తెలియవచ్చాయి.
ఇదీ చూడండి: ఉక్రెయిన్-రష్యా మధ్య మూడోసారి చర్చలు!