కరోనా వైరస్ సవాళ్లు నెలకొన్నప్పటికీ చైనాతో తలెత్తిన సరిహద్దు సంక్షోభాన్ని భారత్ దృఢంగా, పరిణతితో ఎదుర్కొందని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు. పారిస్‌లో జరిగిన ఓ సదస్సులో మాట్లాడిన ఆయన.. ప్రధాన భౌగోళిక సమస్యల గురించి వివరించారు. సరిహద్దు వ్యూహాత్మక లక్ష్యాల విషయంలో తక్షణ సవాళ్లు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదని వ్యాఖ్యానించారు.
ఫ్రాన్స్‌లో ముష్కర మూకలు పేట్రేగిపోతున్న వేళ ఆ దేశంలో పర్యటిస్తున్న ష్రింగ్లా... ఇటీవల అక్కడ జరిగిన ఒక ఉగ్రదాడికి మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయని అన్నారు. ఉగ్రవాద ముప్పును పరిష్కరించుకోవడానికి నాగరిక సమాజాలు దృఢమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
"కరోనా సమస్య ఉన్నప్పటికీ చైనాతో దశాబ్దంలోనే తీవ్రమైన సంక్షోభాన్ని దృఢంగా, పరిణతితో ఎదుర్కొన్నాం. అదేసమయంలో, పశ్చిమ సరిహద్దు(పాకిస్థాన్) వైపు నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద ముప్పును నివారించేందుకు ప్రయత్నించాం. ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన రెండు ఉగ్రదాడులు ఆందోళనకరమైనవి. ఇందులో ఒక దాడి తాలూకు మూలాలు పాకిస్థాన్‌లో ఉన్నాయి."
-హర్షవర్ధన్ ష్రింగ్లా, భారత విదేశాంగ కార్యదర్శి
ఉగ్రవాదం, రాడికలిజం రూపంలో భారత్-ఫ్రాన్స్ దేశాలు సంప్రదాయేతర భద్రత ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పోరాటం ఒక్క సమాజానికో, వ్యక్తులకో పరిమితం కాదని స్పష్టం చేశారు. 'తీవ్రవాద రాజకీయ మతపరమైన భావజాలా'నికి మాత్రమే వ్యతిరేకమని అన్నారు. భారత్ పశ్చిమ సరిహద్దు నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద ముప్పును నివారించేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.