కరోనావైరస్ టీకా అధ్యయన ఫలితాలను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. వ్యాక్సిన్ ప్రయోగించిన వారిలో రోగనిరోధక ప్రతిస్పందనను టీకా ప్రేరేపించినట్లు వెల్లడించింది. 18-55 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో ద్వంద్వ రోగనిరోధక ప్రతిస్పందనలను వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలిగినట్లు అధ్యయనం పేర్కొంది. దీనికి సంబంధించిన ఫలితాలు లాన్సెట్ పత్రికలో ప్రచురితమయ్యాయి.
"దాదాపు అందరిలో రోగనిరోధక స్పందనలు రావడం మేం చూస్తున్నాం. రోగనిరోధక వ్యవస్థ రెండు విభాగాలను వ్యాక్సిన్ ప్రేరేపించింది."
-డాక్టర్ అడ్రియన్ హిల్, జెన్నర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
టీకా స్వీకరించిన రోగుల్లో వైరస్‌ను తటస్థీకరించే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు అడ్రియన్ తెలిపారు. కరోనాతో పోరాడే 'టీ కణాల'ను వ్యాక్సిన్ స్పందించేలా చేసిందని వెల్లడించారు.
కరోనా నుంచి కోలుకున్న వారిలో ఉత్పత్తయిన స్థాయిలో యాంటీబాడీలను వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలిగిందని చెప్పారు. టీ కణాల ప్రతిస్పందన పెరగడం ద్వారా వైరస్ నుంచి అదనపు రక్షణ లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. యాంటీబాడీలతో పాటు టీ సెల్స్ స్పందన పెరుగుతున్న ఆధారాలు కనిపించాయని, కరోనా నియంత్రణలు ఇది చాలా కీలకమని వెల్లడించారు. రెండో డోసు తీసుకున్న తర్వాత రోగనిరోధక ప్రతిస్పందన మెరుగుపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఏడాది చివరి నాటికే తేలేది!
టీకాను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావాలో? లేదో? అనే విషయంపై నిర్ణయం ఈ సంవత్సరం చివరినాటికి తీసుకోవచ్చని తెలిపారు.
వ్యాక్సిన్ పూర్తి సామర్థ్యాన్ని అంచనా వేసే భారీ ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నట్లు అడ్రియన్ స్పష్టం చేశారు. యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లోని దాదాపు 10 వేల మందిపై ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలో 30 వేల మందితో అమెరికాలో ట్రయల్స్ చేపట్టనున్నట్లు వెల్లడించారు.