Nuclear bombs in Russia: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరచూ అణ్వస్త్ర ప్రస్తావన చేస్తోంది. తన అణు బలగాలను అప్రమత్తం చేసింది. వాటి సన్నద్ధతను పరీక్షించడం ద్వారా ప్రమాదకరమైన సంకేతాలను ఇచ్చింది. దీంతో ఈ సామూహిక జనహనన ఆయుధాలతో జరిగే వినాశనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
'ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్' (ఎఫ్‌ఏఎస్) అంచనా ప్రకారం రష్యా వద్ద 5,977 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి. వాటిలో దాదాపు 1500 అస్త్రాలను సర్వీసు నుంచి తొలగించింది. వాటిని నిర్వీర్యం చేయాల్సి ఉంది.
ఎంత విధ్వంసకరం?
గరిష్ఠ స్థాయిలో ఆస్తి, ప్రాణనష్టం కలిగించేలా అణ్వస్త్రాల రూపకల్పన, ప్రయోగం ఉంటుంది. వాటిని నేరుగా నేలపై కాకుండా కొంత ఎత్తులో పేలుస్తారు. దీనివల్ల వెలువడే భీకర ప్రకంపన.. ఆ చుట్టుపక్కల భవనాలను నేలమట్టం చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమాపై వేసిన అణ్వస్త్రం 15 కిలో టన్నుల ప్రభావాన్ని కలిగి ఉంది. నేడు వెయ్యి కిలోటన్నుల కన్నా అధిక సామర్థ్యం కలిగిన వార్‌హెడ్‌లు పలు దేశాల వద్ద ఉన్నాయి. అణ్వస్త్రాలతో కలిగే నష్టాన్ని ప్రభావితం చేసే అంశాలివీ..
* వార్‌హెడ్ పరిమాణం
* నేల నుంచి ఎంత ఎత్తులో దాన్ని పేల్చారు..
* స్థానిక వాతావరణం
75 కి.మీ. దూరం నుంచి వీక్షించినా..
వెయ్యి కిలో టన్నుల అణ్వస్త్రం వల్ల దాదాపు 8 కిలోమీటర్ల దూరంలోని ప్రజలకు కాలిన గాయాలవుతాయి. విస్ఫోట సమయంలో చోటుచేసుకునే వెలుగును 75 కిలోమీటర్ల దూరం నుంచి వీక్షించినా తాత్కాలికంగా కంటిచూపును కోల్పోవాల్సి వస్తుంది. హిరోషిమాపై వేసిన బాంబుతో తక్షణం 66వేల మంది చనిపోయారు. కాలిన గాయాలు, రేడియోధార్మికతతో ఆ తర్వాత వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నేడు పెద్ద నగరాలపై అణు బాంబు ప్రయోగిస్తే లక్షల మంది బలవుతారని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్ నగరాలపై రష్యా విధ్వంసం.. 'అదే జరిగితే అణు యుద్ధమే'