త్రిమితీయ (త్రీడీ) చిత్రాలతో కూడిన హై-రిజల్యుషన్ హోలోగ్రామ్‌లను ముద్రించే పరిజ్ఞానాన్ని ఫ్రాన్స్‌కు చెందిన అల్టీమేట్ హోలోగ్రఫీ సంస్థ నిపుణులు తయారు చేశారు. హోలోగ్రామ్‌లను వివిధ కోణాల్లో చూసినప్పుడు భిన్నమైన దృశ్యాలు అత్యంత స్పష్టంగా కనిపించేలా వీరు చిమెరా ప్రింటర్‌ను తయారుచేశారు.
"మేము తయారుచేసిన ప్రింటర్లో చవకైన వాణిజ్య లేజర్లనే వాడాం. కానీ అత్యంత వేగంగా, నాణ్యమైన, స్పష్టమైన హోలోగ్రామ్‌లను ఇది వేగంగా ముద్రిస్తోంది. ఇందులో ఉండే ప్రత్యేక పరికరాలు మొదట వస్తువులను స్కాన్ చేస్తాయి. తర్వాత ఈ యంత్రం ఆ బొమ్మలను త్రీడీ రూపంలోకి మార్చి, 60x80 సెంటీమీటర్ల పరిమాణంలోని హోలోగ్రామ్‌లను ముద్రిస్తుంది" అని పరిశోధకులు తెలిపారు.
వైద్య అప్లికేషన్లు, మ్యూజియం ప్రదర్శనలు, ఆర్కిటెక్చర్ డిజైన్లలోనూ ఈ ప్రింటింగ్ పరిజ్ఞానం ఉపయోగపడగలదని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్- భాజపా మధ్య 'స్నూపింగ్'పై మాటల తూటాలు