కొవిడ్ అన్ని రంగాలపై పెను ప్రభావం చూపింది. ముఖ్యంగా పర్యటకంపై మహమ్మారి ప్రత్యక్ష , పరోక్ష ప్రభావం చూపింది. దీనిపై ఐరాసకు చెందిన వరల్డ్ టూరిజమ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో) , కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థ(సీటీఏడీ)లు సంయుక్తంగా ఓ నివేదికను అందించాయి. దీని ప్రకారం ప్రపంచ పర్యటక రంగానికి గతేడాది కొవిడ్ మొదలైనప్పటి నుంచి 4 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నాయి. ఈ నివేదికను బుధవారం సమర్పించాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు టీకా కొరతను ఎదుర్కోవడం మరింత నష్టాలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశాయి.
"లక్షల మందిని పర్యటక రంగం పోషిస్తోంది. టూరిజం వేగవంతం కావాలంటే వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసి ప్రజలను కాపాడాల్సి ఉంటుంది. అప్పుడే పరిశ్రమను సురక్షితంగా తిరిగి ప్రారంభించవచ్చు. దీనికి మరిన్ని వనరులు అవసరం" అని యూఎన్ డబ్ల్యూటీవో సెక్రటరీ జనరల్ జురాబ్ పొలోలికాష్‌విలి పేర్కొన్నారు. చాలా వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు పర్యటక రంగంపైనే ఆధారపడి ఉన్నాయని ఆయన తెలిపారు.
గతేడాది కరోనా వ్యాప్తి సమయంలో చాలా దేశాలు విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాయి. అత్యవసరాలకు మినహా వేటికి అనుమతించలేదు. దీంతో ఈ ప్రభావం పర్యటక రంగంపై పడింది. దీంతో ఒక్క గతేడాదే 2.4 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. టీకాల పంపిణీని వేగవంతం చేయకపోతే ఈ ఏడాది కూడా అదే స్థాయిలో నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది.
ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌లో చాలా తేడాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఒక్కశాతం జనాభాకు కూడా టీకాలు అందలేదు.. అదే సమయంలో మరికొన్ని దేశాల్లో 60శాతం జనాభాకు టీకాలు అందాయి. తక్కువ టీకాలు పంపిణీ చేసిన దేశాలు ఆర్థికంగా కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ ఎగుడు దిగుడులు, టీకాల కొరత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యటక రంగాన్ని దెబ్బతీస్తాయని నివేదిక వెల్లడించింది. ఆ దేశాల్లో అత్యధికంగా 80శాతం వరకు పర్యాటక రంగం దెబ్బతినింది. ఇక టీకాలు ఎక్కువగా ఇచ్చిన అమెరికా వంటి దేశాల్లో పర్యటక రంగం వేగంగా పుంజుకొంటుందని అంచనావేసింది. ఇది 2023 నాటికి కరోనా మహమ్మారి ముందు నాటి పరిస్థితులను అందుకొంటుందని తెలిపింది.
ఇదీ చూడండి: అగ్రరాజ్యానికి వడదెబ్బ- పదుల సంఖ్యలో మృతి