కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు కుదేలవుతున్నాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు గత కొన్ని వారాలుగా పలు దేశాలు లాక్డౌన్లో ఉన్నాయి. భారత్ తరహాలోనే జర్మనీలోనూ మే 3నే లాక్డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ముగిశాక దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది జర్మనీ.
వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నందున వచ్చే వారంలో చిన్న చిన్న దుకాణాలను తెరిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మే తొలివారంలో పాఠశాలలను పునఃప్రారంభించాలని యోచిస్తోంది. అయితే.. భౌతికదూరం పాటించటం, మాస్కులు ధరించటం వంటి వాటిని కొనసాగించనుంది.
దేశంలోని 16 రాష్ట్రాల గవర్నర్లతో జర్మనీ ఛాన్సిలర్ ఎంజెలా మెర్కెల్ భేటీ అయ్యారు. దేశంలో పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. పొరుగుదేశాలు ఆస్ట్రియా, డెన్మార్క్ వంటి పలు దేశాలు ఆంక్షలను క్రమంగా తగ్గిస్తున్న నేపథ్యంలో.. జర్మనీలోనూ సడలింపులు చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 30న పరిస్థితులపై మరోమారు అధికారులు సమీక్షిస్తారని స్పష్టం చేశారు.
అందుబాటులోకి వచ్చేవి..
- వచ్చే వారం నుంచి చిన్న చిన్న దుకాణాలను తెరిచేందుకు ప్రణాళిక.
- 800 చదరపు మీటర్ల విస్తీర్ణంలోపు ఉన్న నిత్యావసరేతర దుకాణాలను పలు జాగ్రత్తలతో ప్రారంభించాలని నిర్ణయం. ఈ చర్యతో ఆటో షోరూంలు, ద్విచక్రవాహన విక్రయ కేంద్రాలు, పుస్తకాల దుకాణాలు వంటి వ్యాపార సముదాయాలు వాటి పరిమాణంతో సంబంధం లేకుండా తెరుచుకోనున్నాయి.
- మే 4 నుంచి దశల వారీగా పాఠశాలల పునఃప్రారంభం. తొలుత ఉన్నత స్థాయి తరగతుల విద్యార్థులకు అనుమతి.
- మే 4 నుంచి హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్లు తెరిచేందుకు చర్యలు.
- మతపరమైన ప్రార్థనలపై ఈ వారాంతంలో నిర్ణయం.
ఆంక్షల కొనసాగింపు..
- భౌతిక దూరం పాటించటం, బయటకు వెళ్లిప్పుడు మాస్కులు ధరించటం తప్పనిసరి.
- ఇద్దరికన్నా ఎక్కువ మంది సమావేశమవటంపై నిషేధం. ఇతరులకు 1.5 మీటర్ల దూరం పాటించటం తప్పనిసరి.
- ప్రజారవాణా, దుకాణ సముదాయాల్లో మాస్కులు తప్పనిసరి.
- ఆగస్టు 31 వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు సమావేశం అయ్యేందుకు అనుమతులు నిరాకరణ.
బార్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు ఎప్పుడు తెరుచుకుంటాయనేదానిపై స్పష్టత లేదు.
3,500 మందికిపైగా మృతి
జర్మనీలో ఇప్పటి వరకు 1,30,000 మందికి కరోనా సోకింది. 3,500 మందికిపైగా మరణించారు.అయితే.. కొద్దిరోజులుగా కొత్త కేసుల నమోదు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. ఆరోగ్య వ్యవస్థ అంతగా లేకపోయినప్పటికీ.. ఐరోపాలోని ఇతర దేశాల కేసులు, బాధితులతో పోలిస్తే.. జర్మనీలో ఆ సంఖ్య చాలా తక్కువ.