బ్రిటన్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారి డొమినిక్ కమ్మింగ్స్ లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించి 260 కిలోమీటర్లు ప్రయాణించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవకాశాన్ని అందిపుచ్చుకున్న విపక్షాలు ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. కమ్మింగ్స్పై ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం... కరోనా సమయంలో బ్రిటీష్ ప్రజల త్యాగాలను అవమానించటమేనని మండిపడ్డాయి.
" ఇది ప్రధానమంత్రికి పరీక్ష. అందులో ఆయన విఫలమయ్యారు. డొమినిక్ కమ్మింగ్స్పై బోరిస్ జాన్సన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అనేది ప్రజలు చేసిన త్యాగాలను అవమానించటమే. "
– కేయిర్ స్టార్మెర్, ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత
బోరిస్‌కు ఈ విషయంలో సొంత పార్టీ ఎంపీల నుంచీ విమర్శలు ఎదురయ్యాయి. ప్రధాని ప్రధాన వ్యూహ సలహాదారు కమ్మింగ్స్ను విధుల్లో నుంచి తొలగించాలని కోరుతున్న అధికార కన్సర్వేటివ్ పార్టీ పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరుగుతోంది.
బ్రిటన్ విదేశీ కార్యదర్శి భారత సంతతికి చెందిన లీసా నంది కూడా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. కమ్మింగ్స్పై చర్యలు తీసుకోకపోవటం వల్ల ప్రధాని తన స్నేహితులకు ఒక నిబంధన, ఇతరులకు ఒక నిబంధన ఉందని నిరూపించారని ఆరోపించారు.
ప్రజాప్రయోజనాలను పక్కనపెట్టి రాజకీయ ఆసక్తిపైనే ప్రధాని దృష్టిపెట్టారని ఆరోపించారు స్కాట్లాండ్ తొలి మంత్రి నకోలా స్టార్జియన్. ప్రజా ఆరోగ్య సందేశం, సలహా ప్రస్తుతం సమయంలో ముఖ్యమైనప్పుడు దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు.
ఓ తండ్రి చేసే పనే చేశారు..
కరోనా వైరస్‌పై రోజువారీ ప్రకటనలో భాగంగా ఆదివారం సాయంత్రం ప్రధాని బోరిస్ జాన్సన్.. తన ప్రధాన సలహాదారులపై చర్యలకు బదులు.. ఆయన్ను వెనుకేసుకొచ్చారు. కరోనా మహమ్మారి సమయంలో ఓ తండ్రి చేసే పనే ఆయన చేశారని సమర్థించారు. తన కుమారుడికి కరోనా లక్షణాలు బయటపడిన నేపథ్యంలోనే ప్రయాణం చేసినట్లు తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో
నెట్టింట్లోనూ ప్రధాని బోరిస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు పలువురు నెటిజన్లు. "అహంకారం, నేరం, ఇలాంటి నిజాలను మార్చే వారితో పనిచేయటం మీరు ఊహించగలరా?" అని ట్విట్టర్లో ఓ నెటిజన్ విమర్శించగా.. అది వేల సార్లు షేర్ అయింది.