కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో పలు దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మందుబాబులు, సిగరెట్లు అలవాటు ఉన్న వారి పరిస్థితి వర్ణణాతీతం. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి సిగరెట్ల కోసం ఏకంగా స్పెయిన్‌కు వెళ్లాడు. ఇరు దేశాలను కలిపే పైరినీస్ పర్వతం నుంచి వెళ్తూ, చిక్కుకున్న అతడ్ని రక్షించారు పోలీసులు. కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా వేశారు.
సాహస యాత్ర...
ఆ వ్యక్తి శనివారం దక్షిణ ఫ్రాన్స్‌లోని పెర్పిగ్నన్ నుంచి స్పెయిన్‌లోని లా జోంక్వెరాకు సిగరెట్ల కోసం కారులో బయలు దేరాడు. కానీ పోలీసులు ఆ వ్యక్తిని చెక్‌పోస్ట్ వద్ద నిలిపివేశారు. దీంతో అతను రెండు దేశాలను కలిపే పర్వతం నుంచి కాలినడకన వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా అతను పర్వతం ప్రయాణం కొనసాగించాడు. కానీ దారి మధ్యలోనే అతడు పడిపోయినట్లు గుర్తించిన అధికారులు హెలికాఫ్టర్ సాయంతో రక్షించారు.
135 యూరోల జరిమానా...
కరోనా లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి ఇంటి నుంచి బయటకు వచ్చినందుకు 135 యూరోల జరిమానా విధించారు. ప్రజలు ఎవరు బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.
తక్కువ ధరలనే...
చాలా మంది వ్యక్తులు సిగరెట్లు, ఆల్కహాల్, ఆహార పదార్థాలు, ఆయిల్.. తక్కువ ధరలకు దొరుకుతున్నాయన్న కారణంతో దక్షిణ ఫ్రాన్స్ నుంచి స్పెయిన్ వెళ్తుంటారు.