భారత్‌లో పెగసస్ హ్యాకింగ్ వ్యవహారంపై తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ.. ఫ్రాన్స్‌కు చెందిన సైబర్ భద్రతా విభాగం కీలక ప్రకటన చేసింది. తమ దేశంలోని ఓ ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లలో ఈ స్పైవేర్ కనపించిందని ధ్రువీకరించింది. ఈ మేరకు ఏఎన్ఎస్ఎస్ఐ సంస్థ చేసిన అధ్యయనం వివరాలను మీడియా పార్ట్ అనే ఫ్రెంచ్ ఆన్లైన్ జర్నల్ ప్రచురించింది. తమ ఇద్దరు జర్నలిస్టులపై ఈ స్పైవేర్‌తో నిఘా ఉంచారని చెప్పింది.
పెగసస్ వ్యవహారంపై అంతకుముందు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన సెక్యూరిటీ ల్యాబ్ ఇచ్చిన నివేదికకు దగ్గరగా ఏఎన్ఎస్ఎస్ఐ నిర్వహించిన అధ్యయనం ఉందని మీడియా పార్ట్ తెలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ స్పైవేర్... స్మార్ట్ఫోన్లలో సందేశాలను, కాల్ రికార్డులను తెలుసుకునేందుకు వినియోగించవచ్చని తమ దర్యాప్తులో తేలిందని ఏఎన్ఎస్ఎస్ఐ వివరించింది.
భారత్‌లో దుమారం..
భారత్‌లో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, 40 మందికిపైగా జర్నలిస్టులు సహా 300 మంది మొబైల్ ఫోన్ నంబర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు 'ద వైర్' వార్తాసంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ అనే స్పైవేర్‌ను ఇందుకు వినియోగించారని చెప్పింది. బాధితుల జాబితాలో వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు సహా సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి కూడా ఉన్నారని పేర్కొంది. దీంతో ఈ పెగసస్ వ్యవహారం.. భారత్‌లో తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుపడుతుండగా.. పార్లమెంటు సమావేశాల్లో గందరగోళం నెలకొంటూ వస్తోంది.
ఇవీ చూడండి: