కరోనా రెండోదశ విజృంభణతో కొట్టుమిట్టాడుతున్న భారత్కు తోడుగా ఉంటామన్న విదేశాలు.. సహాయంగా మెడికల్ ఆక్సిజన్ సహా వివిధ వైద్యపరికరాలు అందిస్తున్నాయి. భారత్కు బాసటగా నిలిచిన ఫ్రాన్స్.. 2000 మంది కరోనా రోగులకు 5 రోజుల పాటు సరిపడే ద్రవ ఆక్సిజన్ పంపుతున్నట్లు ప్రకటించింది.
'అండగా ఉంటాం'
వీటితో పాటు దీర్ఘకాలిక అవసరాల కోసం అధిక సామర్థ్యం కలిగిన 8 ఆక్సిజన్ జనరేటర్లు అందజేస్తున్నట్లు తెలిపింది ఫ్రాన్స్. ఇవి ఒక్కొక్కటి 250 పడకలకు ఏడాదిపాటు ప్రాణవాయువు సరఫరా చేయగల సామర్థ్యం కలిగినవని పేర్కొంది. ఐసీయూ పరికరాలు, 28 వెంటిలేటర్లు వెనువెంటనే భారత్కు పంపుతున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ శాఖ వెల్లడించింది. కరోనాను ఎదుర్కొనేందుకు భారత్కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.
భారత్కు కువైట్ మద్దతు..
భారత్కు బాసటగా నిలిచింది కువైట్. ఆక్సిజన్ సరఫరా పరికరాలు సహా అవసరమైన అన్ని వైద్య పరికరాలు పంపాలని ఆ దేశ కేబినెట్ నిర్ణయించింది. అవకాశం ఉన్నంత మేరకు భారత్లో కరోనా మరణాలు తగ్గించేందుకు సహకారాన్ని అందించాలని పేర్కొంది.
బ్రిటన్ ప్రభుత్వం నుంచి మొదలైన సహకారం..
బ్రిటన్ ప్రభుత్వం నుంచి భారత్కు సాయం మొదలైంది. 100 వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మంగళవారం ఉదయం దేశానికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి: ప్రపంచానికి వ్యాక్సిన్ పంచనున్న అమెరికా!