కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా.. తమ దేశంలోకి వచ్చే ప్రయాణికులకు నూతన క్వారంటైన్ నిబంధనలను నిర్దేశించింది బ్రిటన్ ప్రభుత్వం. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారికి 10వేల పౌండ్ల వరకు జరిమానా, పదేళ్లు జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపింది. ఈ నిబంధనలు వచ్చే సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని బ్రిటన్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హాన్కాక్ అన్నారు. బ్రిటన్‌కు వచ్చిన ప్రయాణికులు ప్రభుత్వం సూచించిన హోటల్లో 10రోజులు క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేశారు. సంబంధిత హోటల్‌ను 1750 పౌండ్స్‌తో ముందుగానే బుక్ చేసుకోవచ్చన్నారు.
"రెడ్ లిస్ట్(కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలు) దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు రెండో రోజు, ఎనిమిదో రోజు పరీక్షలు చేయించుకోవాలి. మొదటి కరోనా పరీక్షను నిర్లక్ష్యం చేస్తే 1000 పౌండ్లు, రెండో పరీక్ష చేయించుకోకపోతే 2వేల పౌండ్లు జరిమానా ఉంటుంది. క్వారంటైన్లో ఉండకపోతే 5-10వేల పౌండ్ల జరిమానా, 'రెడ్ లిస్ట్' లోని దేశాల నుంచి వచ్చి.. రాలేదని తప్పుడు సమాచారమిస్తే 10ఏళ్లు జైలు శిక్ష ఉంటుంది."
--- మాట్ హాన్కాక్, బ్రిటన్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి
రెడ్‌లిస్ట్‌లో 33 దేశాలు ఉన్నాయి. వీటిల్లోని ఎక్కువ ప్రాంతాలు దక్షిణాఫ్రికా, యూఏఈ, దక్షిణ అమెరికాలోనే ఉన్నాయి. భారత్ రెడ్ లిస్ట్‌లో లేదు.
ఇదీ చదవండి : సెనేట్ ముందుకు ట్రంప్ అభిశంసన