ఫేస్బుక్ సహా అనుబంధ సామాజిక మాధ్యమాల్లో టీకా సంబంధింత పోస్టులపై లేబుల్స్ తీసుకురానున్నామని ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సోమవారం ప్రకటించారు. వ్యాక్సిన్ పంపిణీపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆంగ్లం సహా మరో ఐదు భాషల్లో ఈ లేబుల్స్ ఉంటాయని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని భాషల్లో వీటిని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు.
'ఉదాహరణకు, వ్యాక్సిన్ సంబంధింత పోస్టులపై టీకాలు సురక్షితం అని, వాటిపై వివిధ దశల్లో ప్రయోగాలు జరిపాకే అందుబాటులోకి తీసుకువచ్చారని మేము లేబుల్స్ జత చేస్తాము' అని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.
ఫేస్బుక్ మరో అప్డేట్ను అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా సమీపంలో ఎక్కడ టీకా పంపిణీ జరుగుతోందో తెలుసుకోవడం వినియోగదారులకు సులువు అవుతుంది.
విమర్శలు..
ఫేస్బుక్ ప్రకటనపై సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్ సంస్థ సీఈఓ ఇమ్రాన్ అహ్మద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కట్టడిచేయడానికి ఈ చర్య సరిపోదని అన్నారు. టీకా విషయంలో తీవ్రమైనవిగా పరిగణించిన పోస్టులనే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇంకా తొలగించలేదని ఆరోపించారు.
ఇదీ చదవండి : భారత పర్యటనకు బ్రిటన్ ప్రధాని- వచ్చేదెప్పుడంటే?