సువిశాల విశ్వంలో మన సౌరకుటుంబంతో పాటు ఎన్నో లక్షల గెలాక్సీలు ఉన్నాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు వీటిపై దృష్టిసారించారు. ఎక్సో ప్లానెట్ల(సౌరకుటుంబ బయట ఉన్న గ్రహలు) అన్వేషణకు ఓ దూరదర్శిని (టెలిస్కోప్)ని రూపొందిస్తోంది యూరోపియన్ అంతరిక్ష సంస్థ. సీహెచ్ఈఓపీఎస్(క్యారక్టరైజింగ్ ఎక్సో ప్లానెట్ శాటిలైట్)కు ఈ టెలిస్కోపును అమర్చి ఎక్సోప్లానెట్లపై పరిశోధన చేస్తారు.
సీహెచ్ఈఓపీఎస్ ప్రయోగానికి ముందు స్పెయిన్లో చివరి పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసింది ఐరోపా అంతరిక్ష సంస్థ. వచ్చే ఏడాది అక్టోబరు, నవంబరు మధ్య ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.
ఎలా పనిచేస్తుంది
స్పేస్ టెలిస్కోపును ఉపగ్రహానికి బయటివైపు అమరుస్తారు. దీనికి శక్తివంతమైన కెమెరాను బిగిస్తారు. సౌరకుటుంబం బయట నుంచి వచ్చే కాంతి కిరణాలను గ్రహించి ఆ సమాచారాన్ని అంతరిక్ష కేంద్రానికి చేరవేస్తుంది ఈ దూరదర్శిని. అందుకే దీనిని ప్లానేట్ హంటర్ (గ్రహాలఅన్వేషిణి) అని పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు.
ఎక్కడ పనిచేస్తుంది
ఈ ఉపగ్రహాన్ని భూమికి 700 కిలోమీటర్ల దూరంలోని భూ కక్ష్యకు దిగువన సంచరించేట్టు ప్రయోగిస్తారు. భూమిపై రాత్రుళ్లు ఏర్పడే ప్రాంతంలోనే తిరుగుతుందీ టెలిస్కోపు. పగటి పూట సూర్యకాంతి వల్ల ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఇలా అమర్చారు. భూమి సగభాగం పగటి సమయం కాగా, మిగిలిన భాగం రాత్రి ఏర్పడుతుంది.
"ప్రస్తుతానికి మేము చిన్నచిన్న గ్రహాలపైనే దృష్టిపెట్టాం. భూమి పరిమాణంలో లేదా అంతకంటే చిన్నగా ఉన్న గ్రహాలనే అన్వేషిస్తున్నాం" -- కేట్ ఇస్సాక్, శాస్త్రవేత్త
ఎక్సోప్లానెట్లను కనిపెడితే..
నక్షత్రాల నుంచి వచ్చే కాంతిపుంజం సాయంతో వాటి చుట్టూ సంచరిస్తున్న గ్రహల గమనాన్ని అంచనా వేస్తారు శాస్త్రవేత్తలు. అంతేకాకుండా వాటి సాంద్రతను, ఆ గ్రహం రాళ్లతో నిండి ఉందా! వాయువు ఆవరించి ఉందా! అసలు అవి ఎలా ఏర్పడ్డాయి.. లాంటి విషయాలను గుర్తిస్తారు.
"మనం భూమి నుంచి ఎన్నో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రాలను చూడగలుగుతున్నాం. ఇలాగే ఎక్సోప్లానెట్స్ కనిపెట్టేందుకు మార్గాన్ని అన్వేషించాం. ప్రస్తుతం అభివృద్ధి చేసిన సాధనం సూదూరంగా ఉన్న నక్షత్రాల కాంతిని గ్రహిస్తుంది" --ఆండ్రెస్ బోర్జెస్ అలెజో, ఉపగ్రహ ప్రాజెక్టు మేనేజర్