కశ్మీర్ అంశంపై ఐరోపా సమాఖ్య భారత్‌కు మద్దతుగా నిలిచింది. దాదాపు 12సంవత్సరాల తరవాత ఐరోపా సమాఖ్య పార్లమెంటులో కశ్మీర్ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా చాలా దేశాలు మన దేశానికి మద్దతుగా నిలిచినట్లు సమాచారం. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సమాఖ్య ఉపాధ్యక్షురాలు ఫెడెరికా మొగెరిని చర్చ ప్రారంభించగా.. సభ్య దేశాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా పోలాండ్ ప్రతినిధి మాట్లాడుతూ..‘‘ప్రపంచంలోనే భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశం. జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు మనం పరిగణనలోకి తీసుకోవాలి" అన్నారు.
" భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లో ఉన్న ఉగ్రమూకలు చంద్రుడి మీది నుంచి ఊడిపడడం లేదు. వారి దాయాది దేశం పాకిస్థాన్ నుంచే వస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం భారత్‌కి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది."
- ఐరోపా సమాఖ్యలో పోలాండ్ ప్రతినిధి.
అలాగే ఇటలీకి చెందిన ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘అణ్వస్త్రాలు ప్రయోగిస్తామంటూ పాకిస్థాన్ బెదిరింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
" పాక్ స్థావరంగానే ఉగ్రవాదులు భారత్‌లో దాడులకు పాల్పడుతున్నారు. అక్కడ(పాక్) జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాత్రం వారు పెదవి విప్పరు. "
- ఐరోపా సమాఖ్యలో ఇటలీ ప్రతినిధి
చివరగా కశ్మీర్ అంశం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని.. ఇరు దేశాలు శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సమాఖ్య తీర్మానించింది.
పాక్‌కు మరో చెంపపెట్టు
భారత అంతర్గత విషయమైన అధికరణ 370రద్దు విషయాన్ని పాక్ అంతర్జాతీయం చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో అనేక దేశాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించి భంగపడింది. చివరకు ఐరాస భద్రతా మండలిలోనూ చుక్కెదురైంది. అనేక దేశాలు కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి పాక్‌కు చురకలంటించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐరోపా సమాఖ్య తీర్మానం కూడా దాయాది దేశానికి చెంపపెట్టనే చెప్పాలి.