కరోనా వైరస్‌తో సహజీవనం చేయక తప్పదని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంగీకరించాయి. అందువల్ల లాక్డౌన్ ఆంక్షలను సడలించి ప్రజలను బయటకు అనుమతిస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కొన్నేళ్ల సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో.. లాక్డౌన్ సడలింపు వల్ల ఉన్న లాభనష్టాలపై వివిధ దేశాల నేతల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఎదురుచూడలేమని.. ప్రజలు కరోనాతో జీవించడానికి అలవాటు పడాలని ఐరోపా నేతలు తేల్చిచెబుతున్నారు.
"లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తే కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉంది. ఈ విషయం మాకు తెలుసు. కానీ వ్యాక్సిన్ కోసం ఇటలీ ఎదురుచూడలేదు. అందుకే అన్నీ ఆలోచించి రిస్క్ తీసుకుంటున్నాం. ఇప్పుడు కాకపోతే అసలెప్పటీకీ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించలేము."
--- గిసెప్పీ కాంటే, ఇటలీ ప్రధాని
వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే కరోనా వైరస్‌కు అసలు వ్యాక్సిన్ కనుగొనలేకపోవచ్చని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు.
"వ్యాక్సిన్‌ను కనుగొనడానికి కావాల్సింది అంతా చేస్తానని ముందే చెప్పాను. అయితే వ్యాక్సిన్‌ను రూపొందించడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అయితే అసలు ఈ ప్రయత్నాలు విజయవంతమవుతాయని చెప్పలేము."
-- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని
ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కేసులు, మరణాలు నమోదైన అమెరికాలోని చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ పాలిత ఓహియో రాష్ట్రంలో బార్లు, బీచ్‌లు రద్దీగా దర్శనమిస్తున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ ఆందోళన వ్యక్తం చేశారు.
"ఓహియోను ఆర్థిక కార్యకలాపాలకు తెరవాలని నిశ్చయించుకున్నాం. ఇప్పటికే 90 శాతం ఆర్థిక కార్యకలాపాలు నడుస్తున్నాయి. పునరుద్ధరణ జరగకపోతే చాలా ప్రమాదం అనుకున్నాం. కానీ ఈ రద్దీని చూస్తుంటే ఆర్థిక వ్యవస్థను తెరిచినా ప్రమాదమే."
-- మైక్ డివైన్, ఓహియో గవర్నర్.
లాక్‌డౌన్‌ను ఎక్కువ రోజులు పాటు అమలు చేస్తే ప్రజల్లో మానసిక సమస్యలు పెరుగుతాయని అమెరికా ఆరోగ్యశాఖ అధికారి అభిప్రాయపడ్డారు. ఫలితంగా అనేకమంది ఆత్మహత్యకు పాల్పడవచ్చని పేర్కొన్నారు.