Sanctions on Russia: ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాను ఇరుకున పెట్టేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు మరిన్ని ఆంక్షలను విధిస్తున్నాయి. రష్యాకు చెందిన మరో 26 మందిపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించింది. వారిలో ఒలిగార్క్‌లు, సీనియర్ అధికారులు, పలు బీమా సంస్థలు ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకూ 680 మంది లక్ష్యంగా ఐరోపా సమాఖ్య ఆంక్షలను విధించింది.
అమెరికా కూడా అదే బాటలో పయనించింది. ఐక్యరాజ్యసమితిలో పనిచేసే 12 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించింది. వారంతా తమ విధులకు అనుగుణంగా పనిచేయడంలేదని అమెరికా పేర్కొంది. ఐరాసలోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా కూడా వీరిలో ఉన్నారు.
ఐరాస నిబంధనలకు విరుద్ధంగా అమెరికా వ్యవహరిస్తోందని నెబెంజియా విమర్శించారు. ఇదే సమయంలో రష్యాలో తాము చేస్తున్న వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు చమురు ఉత్పత్తి దిగ్గజం షెల్ ప్రకటించింది. రష్యా ప్రభుత్వ సంస్థ గాజ్‌ప్రోమ్ సహా అనేక సంస్థల్లో భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. నార్డ్ స్ట్రీమ్-2 పైప్‌లైన్ ప్రాజెక్టు నుంచి కూడా వైదొలుగుతున్నట్లు షెల్ సంస్థ వెల్లడించింది.
ఇదీ చూడండి:
ఫలిస్తున్న 'ఆర్థిక అస్త్రం'... రష్యా బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలు