కొవిడ్ వ్యతిరేక ఆస్ట్రాజెనెకా టీకా కారణంగా రక్తం గడ్డకట్టవచ్చని, అయితే అది చాలా అరుదుగా సంభవిస్తుందని యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ(ఈఎంఏ) పేర్కొంది. ఈ వ్యాక్సిన్ కారణంగా తలెత్తే చిన్నపాటి ఇబ్బందులతో పోల్చితే, దానివల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువని స్పష్టం చేసింది.
18 ఏళ్ల వయసు దాటినవారికి ఆస్ట్రాజెనెకా టీకా ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ సంస్థ బుధవారం వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో.. వ్యాక్సిన్ ప్రభావాల గురించి ప్రస్తావించింది.
"టీకా వేయించుకున్న తర్వాత కొందరు 60 ఏళ్ల లోపు మహిళల్లో రక్తం గడ్డ కట్టడం కనిపించింది. ఐరోపాలో వ్యాక్సిన్లు వేయించుకున్న సుమారు 2.5 కోట్ల మందిలో కేవలం పదుల సంఖ్యలోనే ఈ సమస్య తలెత్తింది. కానీ, ఈ పరిణామం కారణంగా ముప్పు వాటిల్లుతుందనేందుకు ఎలాంటి ఆధారం లభించలేదు"
-ఎమెర్ కూక్, ఈఎంఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
30 ఏళ్లలోపు వారికి ప్రత్యామ్నాయ టీకా
ఆస్ట్రాజెనెకా టీకాతో రక్తంలో సమస్యలు ఎదురవుతాయన్న వార్తల నేపథ్యంలో బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా.. 30 ఏళ్లలోపు వారికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కాకుండా ప్రత్యామ్యాయ టీకా అందించాలని నిర్ణయించింది.
ఈ టీకాతో రక్తం గడ్డ కడుతుందనడానికి బలమైన అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు తమ పరిశీలనలో వెల్లడైందని చెప్పింది. బ్రిటన్లో ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారిలో 79 మందికి రక్తంలో సమస్యలు ఎదురవగా.. వారిలో 19 మంది మృతి చెందారని తెలిపింది. అయితే.. ఈ టీకాతో సమస్యలు అరుదుగా మాత్రమే ఎదురవుతాయని స్పష్టం చేసింది. దీనిపై మరింత దర్యాప్తు అవసరమని పేర్కొంది.
'ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమైనది, సమర్థవంతమైనది. వేలాది మందిని రక్షించింది. ముందుజాగ్రత్త చర్యగా మాత్రమే 30 ఏళ్ల లోపు వారికి ఆస్ట్రాజెనెకాకు ప్రత్యామ్నాయ టీకా అందించాలని నిర్ణయించాం' అని బ్రిటన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇదీ చూడండి:మా టీకా సామర్థ్యం 76 శాతం: ఆస్ట్రాజెనెకా