రష్యాలో విపక్ష నేత అలెక్సీ నావల్నీపై రసాయన మందుతో విష ప్రయోగం చేసినందుకు గానూ ఆ దేశ అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించాలని ఐరోపా సమాఖ్య (ఈయూ) విదేశాంగ మంత్రులు సోమవారం నిర్ణయించారు. అనుమానితుల ఆస్తుల్ని స్తంభింపజేయాలని, ఐరోపాలో వారు పర్యటించకుండా నిషేధించాలని ఫ్రాన్స్, జర్మనీ పిలుపునిచ్చాయి. రసాయన ఆయుధాలను అరికట్టేందుకు వీరిపై నిషేధం విధించాలన్న ప్రతిపాదనకు సభ్యదేశాలన్నీ అంగీకరించాయి.
నావల్నీపై విషప్రయోగానికి సంబంధించి విశ్వసనీయ సమాచారాన్ని రష్యా అందించలేదని ఫ్రాన్స్, జర్మనీ ఆరోపించాయి. రష్యా ప్రభుత్వం పాత్ర లేకుండా నావల్నీపై విష ప్రయోగం జరిగిందనే విషయానికి ఎలాంటి హేతుబద్దత లేదని ఆక్షేపించాయి. అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఈ నేరానికి బాధ్యులైన వారిపై ఆంక్షలు విధిస్తున్నామని స్పష్టం చేశాయి. ఆంక్షలు ఎప్పటి నుంచి ఎవరెవరిపై అమలవుతాయనేది ఈయూ స్పష్టం చేయలేదు.
అయితే.. ఈ ఆంక్షల జాబితాలో తొమ్మిది మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నలుగురు.. ఇంగ్లాండ్ సాలిస్బరీలో జరిగిన నోవిచొక్ దాడిలో నిందుతులు కాగా.. రసాయన ఆయుధాలతో సంబంధం ఉన్న ఐదుగురు ఉన్నారు. దీంతో పాటు సిరియా సైంటిఫిక్ స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌పైనా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విష ప్రయోగం
రష్యా రాజకీయాల్లో కీలక నేతగా, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చిరకాల ప్రత్యర్థిగా పేరుగాంచిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ... సైబీరియాలోని టోమ్స్క్ నుంచి మాస్కోకు విమానంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా స్పృహ తప్పారు. విమానాన్ని అత్యవసరంగా ఓమ్స్క్ నగరంలో ల్యాండ్ చేసి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం రెండు రోజుల తర్వాత జర్మనీకి తీసుకెళ్లారు.
అయితే నావల్నీపై విషప్రయోగమే జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రాన్స్, స్వీడన్‌లోని స్పెషలిస్ట్ ల్యాబ్‌లు ఈ విష ప్రయోగాన్ని ధ్రువీకరించాయి. జర్మనీ సైనిక ల్యాబొరేటరీ సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. విషప్రయోగానికి రష్యాలోని నోవిచొక్ గ్రూప్‌కు చెందిన కెమికల్ నర్వ్ ఏజెంటే కారణమని పేర్కొన్నాయి.
సంబంధిత కథనాలు