Eiffel Tower Height: ప్రపంచంలోనే ఎత్తయిన కళాఖండంగా ఏటా లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది ఐఫిల్ టవర్. ఆకాశానికి తాకుతున్నట్లు కనిపించే ఈ టవర్ ఎత్తు 324 మీటర్లు (1063 అడుగులు). ఇంత విశేషమైన టవర్ ఎత్తు తాజాగా మరింత పెరిగిందట. టవర్ చివరి భాగంలో కొత్తగా దాదాపు ఆరు మీటర్ల (19.69 అడుగుల) డిజిటల్ రేడియో యాంటెన్నాను అమర్చారు. దీంతో ఐఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లకు పెరిగినట్లు అయ్యింది.
130 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ టవర్‌ను తొలుత ఓ అంతర్జాతీయ ప్రదర్శన సందర్భంగా ఏర్పాటు చేశారు. మొదట్లో దీన్ని తాత్కాలికంగానే ఉంచాలని అనుకున్నప్పటికీ శతాబ్దానికిపైగా ప్రపంచ పర్యాటకుల ఆకర్షణతో శాశ్వతంగా విరాజిల్లుతోంది. మరోవైపు టవర్ పైభాగంలో యాంటీనాలను అమర్చి ప్రసారాల కోసమూ ఉపయోగిస్తున్నారు. ఇలా యాంటీనా మార్చిన ప్రతిసారి టవర్ ఎత్తు స్వల్పంగా మారుతోంది. తాజాగా ఓ డిజిటల్ రేడియో యాంటీనాను మార్చారు. హెలికాప్టర్ సహాయంతో టవర్ చివరి భాగంలో కొత్త యాంటీనాను కేవలం 10 నిమిషాల్లోనే అమర్చారు. దీంతో ఐఫిల్ టవర్ ఎత్తు ఆరు మీటర్లు పెరిగి 330 మీటర్లకు చేరుకుంది.
ఇదిలా ఉంటే, ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈ ఐరన్ టవర్‌ను 1889లో నిర్మించారు. 1887 జనవరి 28న ప్రారంభమైన టవర్ నిర్మాణం 1889 మార్చి 15 నాటికి పూర్తయ్యింది. అప్పట్లో ఆ టవర్ ఎత్తు 1,024 అడుగులు. 'గుస్తావ ఐఫిల్'కి చెందిన ఫ్రెంచ్ సివిల్ ఇంజినీరింగ్ సంస్థ దీన్ని రూపొందించింది. ఆయన పేరు మీదే దీనికి ఐఫిల్ అనే పేరు వచ్చింది.
ఇదీ చూడండి : 13,500 మంది రష్యా సైనికులు హతం- కీవ్‌కు మూడు దేశాల ప్రధానులు