అమెరికా అహంకారపూరిత విదేశాంగ విధానాన్ని అవలంబిస్తోందని ఆరోపించింది రష్యా. ఫలితంగా ప్రపంచవ్యాప్త ఆయుధ నియంత్రణ ఒప్పందాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
జెనీవాలో జరుగుతున్న నిరాయుధీకరణ సదస్సులో పాల్గొన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్... అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ క్షీణతను అడ్డుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"ఒక దేశం(అమెరికాను ఉద్దేశిస్తూ) పాటిస్తున్న అహంకారపూరిత, దూకుడైన విదేశాంగ విధానాల వల్ల ప్రమాదకరమైన వినాశక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆధిపత్యం చెలాయించడానికి ఇతర దేశాలకు హాని కలిగించే విధంగా అంతర్జాతీయ సమాజంపై సొంత నియమాలను రుద్దుతోంది. నిరాయుధీకరణ ఒప్పందాలు పునరుద్ధరించడానికి అమెరికాకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది."
-సెర్గీ లావ్రోవ్, రష్యా విదేశాంగ మంత్రి
అంతరిక్షంలో ఆయుధాలు ఏర్పాటు చేసుకోవడం ఆపాలని హితవు పలికారు సెర్గీ. అంతరిక్షంలో ఏర్పడే ఘర్షణలు ఆపేందుకు రష్యా కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.
రష్యా-అమెరికాల మధ్య నాలుగు దశాబ్దాల పాటు ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన విషయం విదితమే. ఫలితంగా 1987లోని ఇంటర్మీడియేట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం రద్దైంది. ప్రపంచ రక్షణకు భద్రతగా భావించే ఆ ఒప్పందం రద్దుతో... అంతర్జాతీయంగా నూతన భయాలు ఉత్పన్నమయ్యాయి.
మరోవైపు 2010లో కుదుర్చుకున్న 'నూతన వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం'నుంచి వైదొలగనున్నట్లు అమెరికా హెచ్చరిస్తోంది. వచ్చే సంవత్సరం ఈ ఒప్పందం గడువు ముగియనుంది.