ఏడాదిన్నరగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి(Corona virus) సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. వైరస్ లక్షణాలపై(Corona symptoms) అధ్యయనం చేస్తున్న బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజీ లండన్ పరిశోధకులు ఇవి స్త్రీలు, పురుషులు సహా వేర్వేరు వయసుల వారిలో వేర్వేరుగా ఉన్నట్లు గుర్తించారు.
ఇందుకోసం బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన జడ్.ఓ.ఈ కొవిడ్ యాప్ సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. కరోనా సోకిన పురుషుల్లో శ్వాస సరిగా ఆడకపోవడం, అలసట, చలి జ్వరం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తే, స్త్రీలలో వాసన కోల్పోడం, ఛాతి నొప్పి, తీవ్ర దగ్గు ఎక్కువగా ఉన్నట్లు కింగ్స్ కాలేజీ లండన్ పరిశోధకులు కనుగొన్నారు. కొవిడ్ ప్రారంభంలో కనిపించే లక్షణాలు వేర్వేరు వ్యక్తులతో పాటు ఇతర కుటుంబాల్లోనూ వేర్వేరుగా ఉంటాయని కింగ్స్ కాలేజీ నిపుణులు తెలిపారు. ఇక వేర్వేరు వయసుల వారిలో వేర్వేరు లక్షణాలు కూడా కనిపించినట్లు వెల్లడించారు.
పరిశోధనలోని కీలక విషయాలు..
- ముఖ్యంగా 60ఏళ్ల వయసుపైబడిన వారిలో వాసన కోల్పోయే ప్రభావం తక్కువగా కనిపించింది. ఇక 80ఏళ్ల వయసువారిలో ఈ లక్షణం దాఖలాలే లేవు. కానీ, ఇలాంటి వృద్ధుల్లో ఎక్కువగా డయేరియా ప్రధాన లక్షణంగా కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు.
- 60నుంచి 70ఏళ్ల మధ్య వారిలో ఛాతి, కండరాల నొప్పులు, శ్వాస ఆడకపోవడం లక్షణాలు కనిపించాయి.
- వృద్ధులతో పోలిస్తే 40 నుంచి 50ఏళ్ల వారిలో దగ్గు, శరీరం చల్లగా మారడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయని పరిశోధకులు పేర్కొన్నారు.
- అత్యధిక వ్యాప్తి కలిగిన కొత్త వేరియంట్లు వెలుగు చూస్తోన్న నేపథ్యంలో కొవిడ్ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని బ్రిటన్ పరిశోధకులు తెలిపారు.
ఇదీ చూడండి: 'పాజిటివిటీ 10%పైన ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు'