భారత్‌లో మొదట బయటపడిన కొవిడ్-19 డెల్టా వేరియంట్ భౌగోళికంగా ప్రభావం చూపుతోందని, దానికున్న గణనీయంగా ప్రబలే స్వభావమే ఈ పరిస్థితికి కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ శుక్రవారం జెనీవాలో మీడియాకు వెల్లడించారు. డబ్ల్యూహెచ్ఓ ప్రతివారం విడుదల చేసే కొవిడ్-19 నివేదికల్లో భాగంగా ఈ నెల 15 నాటి తాజా వివరాల మేరకు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 80 దేశాల్లో డెల్టా వేరియంట్ ప్రబలిందన్నారు. మరో 12 దేశాలు, ప్రాంతాల్లో బి.1.617 వేరియంట్ బయటపడిందని తెలిపారు.
డెల్టా వేరియంట్(బి.1.617.2) మొదట భారతదేశంలోనే గతేడాది అక్టోబరులో బయటపడినట్లు గుర్తు చేశారు. ఒకచోటు నుంచి మరోచోటుకు ప్రబలుతున్న వేరియంట్లతో పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. బ్రిటన్‌లో డెల్టా వేరియంట్ కేసులు వారం రోజుల్లో 33,630 మేర పెరిగాయని, మొత్తం కేసుల సంఖ్య 75,953కు చేరినట్లు 'పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్'(పీహెచ్ఈ) చేసిన ప్రకటన వెలువడిన కాసేపటి తర్వాత సౌమ్య స్వామినాథన్ మీడియాతో మాట్లాడారు.
యూకేలో 99 శాతం డెల్టా వేరియంట్ ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. వివిధ దేశాల్లో, వివిధ వేరియంట్లకు వాడుతున్న పలురకాల వ్యాక్సిన్ల సామర్థ్యంపై మరింత సమగ్రంగా పరిశోధనలు జరిగి, సమాచారం అందుబాటులోకి రావాలని సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. అమెరికాకు కూడా డెల్టా వేరియంట్‌తో ముప్పు ఉన్నట్లు ఆ దేశ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రాచెల్ వాలెన్స్కి వాషింగ్టన్లో తెలిపారు.
ఇవీ చదవండి: WHO: ఐరోపాకు 'డెల్టా వేరియంట్' ముప్పు