ప్రశ్న-1: కరోనా వైరస్.. మృతదేహాల్లో ఎంతకాలం సజీవంగా ఉంటుంది?
ప్రశ్న-2: మృతదేహాల నుంచి కొవిడ్ ఇతరులకు వ్యాపిస్తుందా?
Corona Virus in dead body :
కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి వైద్య వర్గాల్లో చర్చయనీయాంశమైన ప్రశ్నలివి. సమాధానాల కోసం ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి. మరెన్నో జరుగుతున్నాయి. తాజాగా ఇటలీకి చెందిన వైద్యులు కీలక విషయాలు వెల్లడించారు. మృతదేహాల్లో 41 రోజుల వరకు కరోనా వైరస్ బతికి ఉండే అవకాశం ఉంటుందని తేల్చారు. అయితే.. మృతదేహాల నుంచి ఇతరులకు కొవిడ్ వ్యాపిస్తుందా లేదా అనేది నిర్ధరించేందుకు మాత్రం మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉందని స్పష్టం చేశారు.
ఎలా గుర్తించారు?
ఉక్రెయిన్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి.. కొంతకాలం క్రితం ఇటలీలోని చీటీ వద్ద స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో వాతావరణం ఏమాత్రం బాగాలేకపోయినా సముద్రంలో ఈత కొడుతూ, మునిగిపోయాడు. 16 గంటల తర్వాత అతడి మృతదేహం సముద్రంలోని రెండు బండరాళ్ల మధ్య చిక్కుకుని కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.
చనిపోవడానికి ముందు ఆ వ్యక్తికి ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు. అయినా.. ఇటలీ ప్రభుత్వ కొవిడ్ నిబంధనల ప్రకారం శవపరీక్షకు ముందు కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేశారు. పాజిటివ్ అని తేలింది. అంత్యక్రియల నిర్వహణకు అనుమతులు రానందున.. ఆ వ్యక్తి మృతదేహాన్ని సీల్ చేసి, 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆస్పత్రి మార్చురీలో భద్రపరచాల్సి వచ్చింది. ఆ సమయంలో డి అన్నున్జియో విశ్వవిద్యాలయ వైద్యులు.. ఆ శవానికి వరుసగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. 41 రోజుల్లో 28సార్లు సాంపిల్స్ తీసి పరీక్షించగా.. ప్రతిసారీ పాజిటివ్ అనే ఫలితం వచ్చింది. ఆ తర్వాత అంత్యక్రియలు జరపడం వల్ల కరోనా టెస్టు చేయడం కుదరలేదు.
మరిన్ని పరిశోధనలతోనే...
మృతదేహాల నుంచి కరోనా వ్యాప్తిపై ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి. కానీ.. ఎక్కడా శవాల నుంచి కొవిడ్ వ్యాప్తి చెందినట్లు తేలలేదు. మృతదేహాల్లో కరోనా ఎంతకాలం సజీవంగా ఉంటుందన్నదానిపైనా స్పష్టత లేదు. గతంలో జర్మన్ పరిశోధకులు ఇదే విషయంపై అధ్యయనం చేయగా.. పోస్ట్ మార్టం తర్వాత 35 గంటల వరకు వైరస్ శరీరంలో వృద్ధి చెందుతున్నట్లు తేలింది. వస్తువులపై కరోనా సజీవంగా ఉండడంపై పరిశోధన చేసినా.. ఇలాంటి అస్పష్ట ఫలితాలే వచ్చాయి. ఇప్పుడు తాము కనుగొన్న విషయాలు.. ఈ పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపకరిస్తాయని చెబుతున్నారు ఇటలీ వైద్యులు.
వరుసగా 78 సార్లు కరోనా పాజిటివ్- 14 నెలలుగా ఐసోలేషన్‌లోనే..
లక్షణాలు లేవు. కానీ.. కరోనా మాత్రం అతడి శరీరాన్ని వదలడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా 78 సార్లు పరీక్షించినా కొవిడ్ పాజిటివ్ అనేదే ఫలితం. చేసేది లేక 14 నెలలుగా ఐసోలేషన్‌లోనే ఉంటూ నరకం చూస్తున్నాడు టర్కీకి చెందిన వృద్ధుడు. మరిన్ని వివరాలకు..ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చూడండి: అమ్మాయి పుడుతుందని డౌట్.. అబ్బాయిలా మార్చేస్తానని గర్భవతి తలకు మేకు!