బ్రిటిష్ యువరాజు హ్యారీ- యువరాణి మేఘన్ మార్కెల్ దంపతుల కుమారుడికి ప్రత్యేక కానుకను పంపనున్నారు ముంబయి డబ్బావాలాలు. బ్రిటిష్ రాజకుటుంబ వారసుడి కోసం కాలి పట్టీలు, వెండి మొలతాడు కానుకగా ఇవ్వనున్నారు. హనుమంతుడి విగ్రహంతో కూడిన నెక్లెస్నూ పంపనున్నట్లు డబ్బావాలాల సంఘం అధ్యక్షుడు సుభాష్ తాలేకర్ తెలిపారు.
వీరి బంధం 2003 నుంచే...
బ్రిటిష్ రాజకుటుంబంతో ముంబయి డబ్బావాలాలకు మంచి అనుబంధమే ఉంది. 2003లో వేల్స్ యువరాజు ఛార్లెస్.. ముంబయిలోని డబ్బావాలాలను కలిశారు. వారి పనిని చూసి ముగ్ధులయ్యారు. ఈ పర్యటనతో బ్రిటిష్ రాజకుటుంబీకులు- డబ్బావాలాల మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.
2005లో ఛార్లెస్-కామిల్లాల వివాహానికి డబ్బావాలాలకు ఆహ్వానం అందింది. ఫలితంగా వీరి అనుబంధం మరింత గట్టిపడింది. వీరందరి ప్రయాణ ఖర్చులు రాజకుటుంబమే భరించి బ్రిటన్లో జరిగిన పెళ్లికి సాదర స్వాగతం పలికింది.
2018 మే 19న జరిగిన బ్రిటిష్ యువరాజు హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ల విహహ వేడుకలనూ ఘనంగా నిర్వహించారు డబ్బావాలాలు. వధూవరులిద్దరికీ సంప్రదాయ మరాఠీ దుస్తులను పెళ్లి కానుకగా అందజేశారు. ఇప్పుడు వారి కుమారుడికి బహుమానం పంపుతున్నారు.
ఈ డబ్బావాలాలు ఎవరు?
ఆఫీసు పనుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు ఇంటి నుంచో, రెస్టారెంట్ల నుంచో మధ్యాహ్న భోజనం బాక్స్ అందజేసి... ఖాళీ బాక్సులను తిరిగి ఇంటికి ఇచ్చేవారే డబ్బావాలాలు. ఈ భోజన బాక్సులను సైకిళ్లపై గానీ, లోకల్ రైళ్లలో గానీ తీసుకెళ్లి ఉద్యోగులకు అందజేస్తారు. వీరి జీవతకథ ఆధారంగానే 2013లో 'ద లంచ్ బాక్స్' అనే బాలీవుడ్ చిత్రం తెరకెక్కింది.
ఇదీ చూడండి : 'అసలే బాధలో ఉన్నాం.. మీరూ బాధపెట్టకండి'