గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? సామాన్యులు ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టమే. అత్యాధునిక కారు, రేసింగ్ ట్రాక్ తరహా రోడ్ ఉంటే తప్ప అంత వేగం అసాధ్యం. అలాంటిది... సైకిల్‌పై 280 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకెళ్తే...? అసలు ఊహించుకోగలరా? తలుచుకుంటేనే భయమేస్తోంది కదూ!
బ్రిటన్‌కు చెందిన నీల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 50, 100 కాదు సైకిల్‌పై ఏకంగా గంటకు 280.57 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాడు. అలా 200 మీటర్లు ప్రయాణించాడు నీల్ కాంప్‌బెల్. ఈ సాహసానికి యార్క్‌షైర్ కౌంటీలోని ఎల్వింగ్టన్ ఎయిర్‌ఫీల్డ్ రన్‌వే వేదికైంది.
ఎలా సాధించాడంటే?
నీల్ ప్రత్యేకంగా రూపొందించుకున్న సైకిల్‌పై ఈ ప్రయత్నాన్ని చేపట్టాడు. వేగం అందుకునేందుకు పోర్ష్ కయాన్ కారు సాయంతో కాస్త దూరం ప్రయాణించాడు. తర్వాత కారు నుంచి విడిపోయి... సైకిల్‌ను స్వయంగా తొక్కుతూ రికార్డు వేగంతో దూసుకెళ్లాడు.
1995లో నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రెడ్ రోంపెల్బర్గ్ గంటకు 268 కిలోమీటర్ల వేగంతో సృష్టించిన రికార్డును నీల్ ఇప్పుడు బద్దలు కొట్టాడు.
నీల్‌కు ఇలాంటి రికార్డులు కొత్తేం కాదు. గతేడాది 239.8 కిలోమీటర్ల వేగంతో సైకిల్‌పై ప్రయాణించాడు. ఇప్పుడు తన రికార్డును తానే తిరగరాశాడు.